రాజధాని అమరావతి నుండి విశాఖపట్నంకు  తరలించటంలో భాగంగా ప్రభుత్వం ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించనున్నట్లు సమాచారం. రాజధాని తరలింపు విషయంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన హై పవర్ కమిటి శుక్రవారం సమావేశమైంది. ఈ సందర్భంగా సమావేశమైన మంత్రులు రాజధానిలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలపైన కూడా సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం.

 

రాజధాని అమరావతి నుండి విశాఖపట్నంకు తరలితే ఎఫెక్టయ్యే చాలామందిలో ఉద్యోగులు ముందు వరసలో ఉంటారు. ఎందుకంటే ఇపుడు అమరావతి సచివాలయంలో  పనిచేస్తున్న ఉద్యోగులందరూ ఐదేళ్ళ క్రితమే హైదరాబాద్ నుండి అమరావతికి వచ్చారు. అప్పటి చంద్రబాబునాయుడు  ప్రభుత్వం  ఉద్యోగులతో చర్చించకుండానే  అందరినీ తరలించేసింది.

 

హఠాత్తుగా హైదరాబాద్ నుండి అమరావతికి తరలి వెళ్ళాలంటే ఎవరికైనా ఇబ్బందే.  భార్యా, భర్తలు ఉద్యోగులయ్యుండి అందులోను ఒకరు ప్రైవేటు ఉద్యోగో లేకపోతే కేంద్రప్రభుత్వ ఉద్యోగో, వ్యాపారస్తుడో అయితే మరింత సమస్యే. ఆ విషయాలన్నీ ఉద్యోగులు మొత్తుకున్నా చంద్రబాబు ఏవీ పట్టించుకోలేదు. మొత్తానికి అందరూ అమరావతికి వచ్చి ఇపుడిప్పుడే సెటిల్ అవుతున్నారు.

 

అలాంటిది మళ్ళీ హఠాత్తుగా అమరావతి నుండి విశాఖపట్నంకు వెళ్ళాలంటే వేలాది మంది ఉద్యోగులు లబోదిబో మంటున్నారు. అందుకనే వాళ్ళు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం కొన్ని సౌకర్యాలు కల్పించే విషయాన్ని  ఆలోచిస్తోందని సమాచారం.  విశాఖపట్నంకు తరలివచ్చే ఉద్యోగులకు అవకాశం ఉన్న చోట 200 గజాల ఇంటి స్ధలం, ఇల్లు కట్టుకోదలచుకున్న వారికి రూ. 25 లక్షల వరకూ రుణం ఇప్పించాలన్నది ఓ పరిశీలన.

 

ఇందులో భాగంగా ఉద్యోగులు తమ ఇంటి సామానును తరలించేందుకు అయ్యే ఖర్చులో ఉద్యోగుల స్ధాయిని బట్టి రూ. 50 వేల నుండి లక్ష వరకూ ప్రభుత్వమే  భరించాలనే సూచనను పరిశీలిస్తున్నట్లు తెలిసింది.  నిజానికి ప్రభుత్వ ఉద్యోగన్నాక ఎక్కడికి బదిలి చేస్తే అక్కడికి వెళ్ళాల్సిందే. కానీ ఇటువంటి ప్రత్యేక పరిస్దితుల్లో  ఉద్యోగుల సమస్యలను కూడా సానుభూతితో పరిశీలిస్తే బాగుంటుందని హైవర్ కమిటి సూచన చేసే విషయాన్ని పరిశీలిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: