ప్రస్తుతం దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌరసత్వ పట్టికకు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం జాతీయ జనాభా పట్టిక(ఎన్.పీ.ఆర్) రూపకల్పనకు సిద్ధమైంది. ప్రతిపక్షాలు ఇప్పటికే జాతీయ జనాభా పట్టికపై విమర్శలు చేస్తున్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం పౌరసత్వ గుర్తింపు కార్డులు ఇవ్వడమే తమ లక్ష్యమని చెబుతోంది. ఇలాంటి సమయంలో తాజాగా జనాభా లెక్కలకు సంబంధించిన ఒక కీలక ప్రకటన ప్రభుత్వం నుండి విడుదలైంది. 
 
కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కల కోసం సేకరించే అంశాలలో ఇంట్లో ధాన్యానికి సంబంధించిన వివరాలను కూడా సేకరించనున్నట్టు ప్రకటన చేసింది. ప్రభుత్వం జనాభా లెక్కల కొరకు ధాన్యం వివరాలతో పాటు గృహ వినియోగానికి సంబంధించిన ఇతర వివరాలు కూడా నమోదు చేయనున్నట్టు తెలుస్తోంది. మొబైల్ నంబర్, గ్యాస్ పైప్ లైన్ కనెక్షన్, స్మార్ట్ ఫోన్ వివరాలను కూడా సేకరించనున్నట్టు తెలుస్తోంది. ధాన్యం వివరాలను సేకరించటంపై ఇలాంటి వింత ప్రశ్నలు తొలిసారి అడుగుతున్నారని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 
 
మొదటిసారి కేంద్ర ప్రభుత్వం ఇలాంటి వివరాలను సేకరించనుంది. మొబైల్ నంబర్ వివరాలను కమ్యూనికేషన్ కోసం సేకరించనున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. బ్యాంకింగ్ కు సంబంధించిన వివరాలను మాత్రం ఈసారి తొలగించినట్టు తెలుస్తోంది. హోం మంత్రిత్వ శాఖ రిజిస్ట్రార్ నిన్న జనాభా లెక్కల సేకరణ మరియు ఎన్.పీ.ఆర్ కు సంబంధించిన నోటిఫికేషన్ ను జారీ చేయగా మొత్తం 31 అంశాలకు సంబంధించిన వివరాలను పౌరుల నుండి సేకరించనున్నారు. 
 
ఏప్రిల్ నెల నుండి జనాభా లెక్కల సేకరణ ప్రారంభమవుతుందని సమాచారం. సెప్టెంబర్ నెల వరకు జనాభా లెక్కల సేకరణ జరగనుందని జాతీయ జనాభా పట్టిక(ఎన్.పీ.ఆర్)ను కూడా అదే సమయంలో అప్ డేట్ చేయనున్నారని సమాచారం. జాతీయ జనాభా పట్టిక యొక్క ముఖ్య ఉద్దేశం దేశంలో అసలు ఎంతమంది నివశిస్తున్నారు అనే లెక్క తేల్చడమే అని తెలుస్తోంది. 6 నెలలుగా దేశంలో నివశిస్తున్న విదేశీయుల వివరాలను కూడా ఇందులో నమోదు చేస్తారని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: