అమరావతి వ్యవహారంలో సగం మునిగిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్, కేంద్ర అధికార పార్టీ బీజేపీని నిండా ముంచేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది. విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని బాధ్యత కేంద్రానిదేనని, కాబట్టి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలపై తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలంటూ పవన్ కొత్త డిమాండ్ తెరపైకి తెచ్చారు. రాజధాని రైతులకు మద్దతుగా దీక్ష చేపట్టేందుకు సిద్ధమవుతున్న పవన్ ఈ సందర్భంగా అనేక కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజధాని వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర లో ఉండాలని, తప్పనిసరిగా అఖిలపక్షం ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకోవాలని పవన్ డిమాండ్ చేశారు.


 ముఖ్యంగా జాతీయ పార్టీలైన కాంగ్రెస్ బిజెపిలు అమరావతి విషయంలో తమ విధానం ఏమిటో స్పష్టంగా ప్రకటించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అయినా ఏ నిర్ణయం తీసుకున్నా రైతులకు అన్యాయం జరగకూడదని సూచించారు. ఏపీలో రాజధాని వ్యవహారంపై చర్చ జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం చూసీచూడనట్టుగా వ్యవహరిస్తోందని, ఇది సరికాదని అన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రెండు నాలుకల ధోరణిని చూపిస్తున్నారని, అమరావతి రైతులు కలిసినప్పుడు అమరావతి ఎక్కడికి పోదని చెబుతారు. వారు వెళ్లిపోయిన తర్వాత అమరావతి కేంద్ర పరిధిలోని అంశం కాదని ప్రకటించడాన్ని పవన్ తప్పు పట్టారు. 

 

కేంద్రం గట్టిగా ఒక మాట చెబితే పవన్ రాజధాని తరలింపు వ్యవహారాన్ని ఎక్కడిదక్కడే ఆపేస్తారని,  కానీ ఈ విషయంలో ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారో అర్థం కావడం లేదు అంటూ పవన్ విమర్శించారు. ఏపీ బీజేపీ నేతలు అమరావతికి మద్దతుగా మాట్లాడుతుంటే కేంద్ర పెద్దలు మాత్రం తమకేమి పట్టనట్టుగా ఈ వ్యవహారాన్ని వదిలేయడం కరెక్ట్ కాదు అంటూ పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలో మరిన్ని ఉద్రిక్తతలు పెరగక ముందే కేంద్రం జోక్యం చేసుకుని ఏదో ఒక నిర్ణయం తీసుకుని రైతులకు న్యాయం చేయాలని పవన్ కోరారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: