మరి కొద్ది రోజుల్లో మెగాస్టార్ చిరంజీవి వైసిపిలో చేరబోతున్నట్లు సమాచారం. వైసిపిలో చేరటం ద్వారా మళ్ళీ రాజకీయంగా యాక్టివ్ అవ్వాలని మెగాస్టార్ డిసైడ్ అయ్యారట. రానున్న ఏప్రిల్ నెలలో  ఏపి కోటాలో నాలుగు రాజ్యసభ స్ధానాలను భర్తీ చేయాలి. వాటిల్లో ఒకదాన్ని చిరంజీవికి ఇవ్వటానికి జగన్మోహన్ రెడ్డి రెడీగా ఉన్నట్లు సమాచారం.  ఈ విషయం ఇప్పటికే మెగాస్టార్ తో జగన్ మాట్లాడినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

 

చిరంజీవి కూడా జగన్ ప్రతిపాదనకు సానుకూలంగానే ఉన్నప్పటికీ ఇంకా తన నిర్ణయాన్ని చెప్పలేదు. మంత్రి కన్నబాబు ఇటు చిరంజీవికి అటు జగన్ కు బాగా సన్నిహితుడన్న విషయం తెలిసిందే.  కన్నబాబు ద్వారానే  ఇద్దరికీ మధ్య వ్యవహారాలు నడుస్తున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వైసిపి తరపున రాజ్యసభ సభ్యత్వం  తీసుకోవటానికి చిరంజీవికి ఉన్న ఇబ్బందులు కూడా ఏమీ లేవు.

 

కాకపోతే తమ్ముడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యతిరేకిస్తే వ్యతిరేకించచ్చు. అయితే పవన్ ఇప్పటికే చంద్రబాబునాయుడు జేబులోని మనిషిగా మారిపోయాడు. కాబట్టి పవన్ అభ్యంతరాలను మెగాస్టార్ ఎంతవరకూ పరిగణలోకి తీసుకుంటాడన్నది చూడాల్సిందే.  అయితే రాజ్యసభ ఎంపిగా వెళ్ళటానికి ఓకే అంటే ముందుగా చిరంజీవి వైసిపి సభ్యత్వం తీసుకోవాల్సిందే. దానికే ఇంకా ముహూర్తం కుదరలేదని సమాచారం.

 

నిజానికి చిరంజీవిని వైసిపిలోకి చేర్చుకోవటం ద్వారా జగన్ కు ఎంత వరకూ ఉపయోగమంటే చెప్పటం కష్టమే. ఎందుకంటే గతంలోనే చిరంజీవి ప్రజారాజ్యంపార్టీని పెట్టి ఫెయిలయ్యారు. చివరకు పార్టీని నడపటం కూడా చేతకాక కాంగ్రెస్ లో కలిపేశాడు.

 

సరే ఒప్పందంలో భాగంగానే కాంగ్రెస్ లో  రాజ్యసభ ఎంపి అవ్వటం తర్వాత కేంద్రమంత్రి అవ్వటం అందరికీ తెలిసిందే. అంటే చిరంజీవి రాజకీయ జీవితాన్ని చూస్తే ఆయనది  ఫెయిల్యూర్ చరిత్రనే చెప్పాలి. ఇక కాపుల ఓట్ల కోసమే చిరంజీవిని చేర్చుకోవాలని కూడా ఏమీ లేదు. ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో జగన్ ను పవన్ వ్యతిరేకించినా చిరంజీవి మద్దతు ఇవ్వకపోయినా మెజారిటి కాపుల ఓట్లు వైసిపి కే పడ్డాయి. కాబట్టి కాపు ఓట్ల కోసం కూడా వైసిపికి చిరంజీవి అవసరం లేదు.  మరి ఏ విధంగా వైసిపికి చిరంజీవి ప్లస్ అవుతారో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: