సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా చురుకైన పాత్ర పోషిస్తున్న పోసాని కృష్ణ మురళి, కమెడియన్ పృథ్వీ ఒకరికొకరు ఘాటైన వ్యాఖ్యలతో మాటల యుద్ధానికి తెరలేపారు. ఇద్దరిలో పృథ్వీ వైసీపీలో కీలక నాయకుడిగా ఉంటే.. పోసాని వైసీపీ సపోర్టర్ గా ఉన్నారు. ఏపీలో రాజధాని అంశంపై అమరావతి ప్రాంత రైతులు చేస్తున్న దీక్షలను పెయిడ్ ఆర్టిస్టులు చేస్తున్న దీక్షగా ఇటివల సినీ నటుడు, వైసీపీ నాయకుడు, ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీ వ్యాఖ్యానించాడు. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ మరో సినీ నటుడు, వైసీపీ సపోర్టర్ పోసాని నిన్న ప్రెస్ మీట్ పెట్టి తీవ్రంగా ఖండించిన విషయం తెలిసిందే.

 

 

దీనిపై పృథ్వీ ఈరోజు స్పందించారు. పోసానికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రైతుల నుంచి భూములు తీసుకున్నప్పుడు.. పోసాని ఏమైపోయారని పృథ్వీ మండిపడ్డారు. అప్పట్లో ఆయన ఎందుకు స్పందించలేదని నిలదీశారు. పార్టీ స్టాండ్ ప్రకారమే నేను మాట్లాడానని స్పష్టం చేశారు. ఎవరో మాట్లాడితే నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని తీవ్ర స్వరంతో అన్నారు. నా వల్ల పార్టీ నష్టపోతుందని తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. పోసానికి దమ్ముంటే ఓ వేదికపైకి వచ్చి మాట్లాడాలని సవాల్ విసిరారు. తాను వ్యవసాయం చేసే రైతులను పెయిడ్ ఆర్టిస్టులు అనలేదని.. అమరావతిలో ధర్నాలు చేస్తున్నవారు ముమ్మాటికీ పెయిడ్ ఆర్టిస్టులేనని మరోసాని స్పష్టం చేశారు. నాతోపాటు నటించిన ఆర్టిస్టులు కూడా అక్కడ ఉన్నారని పృథ్వీ వ్యాఖ్యానించారు.

 

 

‘సినిమా స్నేహితులను ఇస్తుంది.. రాజకీయం శత్రువుల్ని పెంచుతుంది’ ఈ మాట ఇటివల మెగాస్టార్ చిరంజీవి సరిలేరు నీకెవ్వరు సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్ లో చెప్పిన మాట. ఈ మాట అక్షరాలా నిజమని వీరిద్దరూ నిరూపిస్తున్నారు. ఇద్దరూ వైసీపీలోనే ఉండి ఇటువంటి పోటాపోటీ వ్యాఖ్యలకు దిగడంపై సీఎం జగన్ ఎలా స్పందిస్తారో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: