చంద్రబాబునాయుడు డిమాండ్ కు పార్టీ ఎంఎల్ఏలే షాకివ్వటానికి రెడీగా ఉన్నట్లు సమాచారం. అమరావతిలో కూర్చుని రాజధానిని మార్చేందుకు లేదంటూ గడచిన 24 రోజులుగా చంద్రబాబు ఎంత యాగీ చేస్తున్నారో అందరూ చూస్తున్నదే.  విశాఖపట్నం, కర్నూలు గురించి చంద్రబాబు ఎక్కడా మాట్లాడకుండా కేవలం అమరావతి చుట్టూనే రాజకీయం చేస్తున్నారు. అయితే  చంద్రబాబు చేస్తున్న యాగీతో పార్టీ నేతల్లోనే భిన్నాభిప్రాయాలు మొదలయ్యాయట.

 

పైకి చెప్పకపోయినా సచివాలయాన్ని  విశాఖపట్నంలోను హై కోర్టును కర్నూలులోను ఏర్పాటు చేయటానికి చంద్రబాబు పూర్తిగా వ్యతిరేకిస్తున్నది వాస్తవం. ఇక్కడే ఉత్తరాంధ్ర, రాయలసీమ ఎంఎల్ఏలు చంద్రబాబుతో విభేదిస్తున్నారట.  జగన్మోహన్ రెడ్డి ప్రకటనకు నిరసనగా రాజీనామాలు చేయాల్సొస్తే తాము అందుకు సిద్ధంగా లేమని కూడా కొందరు ఎంఎల్ఏలు పార్టీ నేతలతో చెబుతున్నట్లు సమాచారం. ఉత్తరాంధ్రలో  టిడిపికి ఐదుమంది ఎంఎల్ఏలున్నారు. ఇందులో విశాఖనగరంలోనే నలుగురున్నారు. శ్రీకాకుళంలో అచ్చెన్నాయుడు గెలిచారు.

 

అలాగే రాయలసీమ మొత్తం మీద పార్టీ తరపున గెలిచిందే ముగ్గురు. ఇందులో చంద్రబాబును మినహాయిస్తే అనంతపురంలో నందమూరి బాలకృష్ణ, పయ్యావుల కేశవ్. వీరిలో బాలయ్య సంగతిని పక్కనపెడితే పయ్యావుల మాత్రం మొన్న గెలిచిందే అతి తక్కువ మెజారిటితో. కాబట్టి మళ్ళీ గెలవటం అనుమానమే.

 

ఇక ప్రకాశం జిల్లాలో నలుగురు, ఉభయ గోదావరి జిల్లాల్లో ఇద్దరు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఇద్దరేసి చొప్పున గెలిచారు. అయితే ఈ నలుగురిలో ఇప్పటికే గన్నవరం, గుంటూరు పశ్చిమ ఎంఎల్ఏలు వల్లభనేని వంశీ, మద్దాలి గిరిధర పార్టీకి దూరమైనట్లే. కాబట్టి వీరి రాజీనామాను కోరే అవకాశం లేదు. కాబట్టి ఎలా చూసినా ఎంఎల్ఏలుగా  రాజీనామాలు చేయటానికి ఓ నలుగురైదుగురు తప్ప మిగిలిన వాళ్ళెవరూ ఇష్టపడటం లేదని సమాచారం.  ప్రధానకారణం ఏమిటంటే రాజీనామాలు చేస్తే మళ్ళీ గెలుస్తామన్న నమ్మకం లేకపోవటమే. అందుకనే చంద్రబాబు రాజీనామా ప్రతిపాదన తెస్తే వ్యతిరేకించాలని అనుకుంటున్నారట. చూద్దాం ఏం జరుగుతుందో.

 

మరింత సమాచారం తెలుసుకోండి: