గిరిజన ప్రాంతాల అభివృద్దికి తమ ప్రభుత్వం రూ.130కోట్లను విడుదల చేసినట్టు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏజెన్సీ ఏరియాలో రహదారుల ఏర్పాటుకు, అదనపు భవనాల  నిర్మాణానికి రూ. 130.46 కోట్లను మంజూరు చేస్తూ ఉత్తర్వులను జారీ చేసామని  వెల్లడించారు. ప్రధానంగా ఇప్పటి వరకూ రహదారులు లేక అత్యవసర వేళల్లో రోగులను తరలించడానికి డోలీలపై ఆధారపడుతున్న గిరిశిఖర గ్రామాలకు రోడ్ ఫార్మేషన్ చేయడానికి ప్రత్యేకంగా 236 రోడ్డు పనులను మంజూరు చేసామని తెలిపారు. రాష్ట్రంలోని పార్వతీపురం, సీతంపేట, పాడేరు, రంపచోడవరం, కేఆర్ పురం, శ్రీశైలం తదితర ఐటీడీఏల పరిధిలో గిరిజన ఆవాసాలకు మౌలిక సదుపాయాలను మెరుగుపర్చడంతో పాటుగా గిరిజన విద్యా సంస్థలు, కార్యాలయాలకు అవసరమైన అదనపు భవన నిర్మాణపనులకు ఈ నిధులను మంజూరు చేసామని శుక్రవారం మీడియాకు విడుదల చేసిన ఓ ప్రకటనలో పుష్ప శ్రీవాణి తెలిపారు. 

వివిధ ఐటీడీఏల పరిధిలో ఉన్న అనేక గిరిజన ఆవాసాలకు తరతరాలుగా రహదారి సౌకర్యాలు లేకపోవడంతో అత్యవసర వేళల్లో ఆంబులెన్స్ లు కూడా వెళ్లలేని పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. ఈ కారణంగానే రహదారులు లేని గిరిశిఖర గ్రామాల నుంచి గిరిజనులు రోగులను, బాలింతలను డోలీలలో మోసుకురావాల్సిన పరిస్థితులు నేటికీ కొనసాగుతున్నాయని వివరించారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న గిరిశిఖర గ్రామాలకు ముందుగా రోడ్ ఫార్మేషన్ పనులు పూర్తి చేస్తే వాహనాల రాకపోకలకు అవకాశం ఏర్పడుతుందన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఆరు ఐటీడీఏల పరిధిలో 236 రోడ్ ఫార్మేషన్ పనుల కోసం రూ.23.50 కోట్లను మంజూరు చేసామని వివరించారు.  ఇది కాకుండా ప్రధాన రహదారుల నుంచి గిరిజన గ్రామాలకు చేరుకోవడానికి ప్రస్తుతం ఉన్న 20 మట్టి రోడ్ల స్థానంలో తారు (బీటీ) రోడ్ల నిర్మాణాన్ని కూడా మంజూరు చేసామని దీని కోసం రూ. 61.04 కోట్లను కేటాయించామని పుష్ప శ్రీవాణి పేర్కొన్నారు.

 గిరిజన సంక్షేమ శాఖకు చెందిన విద్యా సంస్థలు, కార్యాలయ భవనాలలో అదనపు గదులను నిర్మించడానికి, అసంపూర్తిగా ఉన్న భవనాల నిర్మాణాన్ని పూర్తి చేయడానికి కూడా నిధులను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఆరు ఐటీడీఏల పరిధిలో  57 భవనాలు, ఇతర సౌకర్యాల కల్పన కోసం రూ. 45.90 కోట్లను మంజూరు చేసామని చెప్పారు. ఆరు ఐటీడీఏల పరిధిలో 236 రోడ్ ఫార్మేషన్ పనులు, 20 తారు రోడ్లు, 57 భవనాల నిర్మాణానికి 130.46 కోట్లను మంజూరు చేస్తూ ఉత్తర్వులను కూడా జారీ చేయడం జరిగిందని పుష్ప శ్రీవాణి వివరించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: