ఇరాన్ మిలిట‌రీ క‌మాండ‌ర్ సులేమానీ హ‌త్య ప్ర‌పంచ‌వ్యాప్తంగా యుద్ధ‌మేఘాల‌ను క‌మ్ముకునేలా చేసింద‌నే సంగ‌తి తెలిసిందే. ఇరాన్‌-అమెరికా మ‌ధ్య ప్ర‌స్తుతం ప‌చ్చ‌గ‌డ్డి వేయ‌కుండా భ‌గ్గుమ‌నే ప‌రిస్థితి ఉంది. సులేమానీ వాహ‌నాన్ని డ్రోన్ దాడితో పేల్చేసిన అమెరికాకు .. క‌మాండ‌ర్ క‌ద‌లిక‌ల గురించి ఎలా తెలిసింద‌న్న దానిపై ఇరాన్ ఆరాతీస్తోంది. సులేమానీ ఆచూకీ కోసం అమెరికా చాన్నాళ్ల నుంచి గాలిస్తున్న విష‌యం తెలిసిందే. ఇంత‌కీ అత‌ని క‌దిలిక‌ల‌కు సంబంధించిన సమాచారం ఎలా బ‌య‌ట‌ప‌డింద‌న్న దానిపై ఇరాక్‌కు చెందిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఆరా తీసింది. దీని ప్ర‌కారం, సిరియా, ఇరాక్‌లో ఉన్న అమెరికా ఇన్‌ఫార్మ‌ర్లే సులేమానీ క‌ద‌లిక‌ల‌పై స‌మాచారాన్ని అందించిన‌ట్లు తెలుస్తోంది. దీంతో కేసుకు సంబంధించి విచార‌ణ కొన‌సాగుతున్న‌ది.

 


ఇరాక్‌కు చెందిన నేష‌న‌ల్ సెక్యూర్టీ అడ్వైజ‌ర్ ఫాలిహ్ అల్ ఫ‌యాద్ ఈ కేసులో ద‌ర్యాప్తు చేప‌ట్టారు. కొన్నాళ్ల నుంచి సులేమానీ త‌న ప్రైవేటు ఫ్ల‌యిట్‌ను వాడ‌డం లేదు. తాజాగా త‌న ప్ర‌యాణంలో భాగంగా,  సిరియా రాజ‌ధాని డ‌మ‌స్క‌స్‌లోని విమానాశ్ర‌యం నుంచి బాగ్దాద్‌కు సులేమానీ బ‌య‌లుదేరాడు. సిరియాకు చెందిన చామ్ వింగ్స్ ఎయిర్‌లైన్‌లో ఆయ‌న ప్ర‌యాణించారు. ఆయ‌న‌తో పాటు కొంద‌రు గార్డ్స్ ఉన్నారు. వాస్త‌వానికి చామ్ వింగ్స్ ప్యాసింజ‌ర్స్ లిస్టులో సులేమానీ పేరు లేదు. వాళ్లు నేరుగా విమానం వ‌ద్ద‌కు వాహ‌నంలో వ‌చ్చేశారు. ఆ త‌ర్వాత బాగ్దాద్ ప‌య‌న‌మ‌య్యారు. బాగ్దాద్ విమానాశ్ర‌యంలో సుమారు రాత్రి 12.30 నిమిషాల‌కు విమానం ల్యాండ్ అయ్యింది. రన్‌వేపై విమానం ఆగిన స‌మ‌యంలో ఆ విమానం వ‌ద్ద‌కు ఓ వాహ‌నం వ‌చ్చింది. ఆ వాహ‌నంలో ఇరాకీ మిలిటెంట్ నేత అబూ మ‌హ‌దీ ముహండి ఉన్నారు. సులేమానీ, మ‌హ‌దీ క‌లుసుకున్న త‌ర్వాత .. ఆ ఇద్ద‌రూ ఓ వాహ‌నంలో ఎంట్రీ గేటు నుంచి కాకుండా మ‌రో గేటు ద్వారా బ‌య‌లుదేరి వెళ్లారు. సులేమానీ వాహ‌నం వెనుక గార్డ్స్ వాహ‌నం ఫాలో అయ్యింది. అయితే గేటు దాటిన కొన్ని సెక‌న్ల‌కే అమెరికా డ్రోన్లు సులేమానీ వాహ‌నాన్ని పేల్చేశాయి. ఆ త‌ర్వాత మ‌రికొన్ని సెక‌న్ల తేడాలో రెండ‌వ వాహ‌నాన్ని పేల్చేశాయి.

 

 

సులేమానీని ఎలా ట్రాక్ చేశార‌న్న దానిపై డ‌మ‌స్క‌స్‌, బాగ్దాద్ విమానాశ్ర‌యాల‌పై స్ట‌డీ చేశారు. బాగ్దాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇద్ద‌రు సెక్యూర్టీ ఉద్యోగులు, చామ్ వింగ్స్ విమానంలోని మ‌రో ఇద్ద‌రు ఉద్యోగులే.. సులేమానీ గురించి అమెరికాకు స‌మాచారం అందించిన‌ట్లు భావిస్తున్నారు. సులేమానీ బాగ్దాద్ వెళ్తున్న విష‌యం.. డ‌మ‌స్క‌స్ విమానాశ్ర‌యం నుంచి తొలుత స‌మాచారం బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ట్లు గుర్తించారు. ఇక బాగ్దాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న వాళ్లు.. కేవ‌లం క‌న్ఫార్మ్‌ చేస్తే స‌రిపోతుంది. అనుకున్న‌ట్లే టార్గెట్ సులేమానీ విమానం దిగిన వెంట‌నే బాగ్దాద్ సెల్ ఆ విష‌యాన్ని క‌న్ఫార్మ్ చేసింది. వ‌చ్చింది సులేమానీ అని తెలియ‌డంతోనే.. అమెరికా త‌న డ్రోన్ల‌తో అత‌న్ని అటాక్ చేసింది. ఈ నేప‌థ్యంలో చామ్ వింగ్స్ విమానంలో ఉన్న ఓ ఉద్యోగి, ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న ఆ సంస్థ మ‌రో ఉద్యోగిని విచార‌ణ అధికారులు ప్ర‌శ్నిస్తున్నారు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: