అమరావతి నుంచి రాజధానిని విశాఖపట్నం కు తరలించాలని సూత్రప్రాయంగా నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం , ఉద్యోగుల నుంచి ఎటువంటి నిరసన తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది . రాజధాని తరలింపు వ్యవహారం పై ఇప్పటి వరకూ మౌనంగా ఉన్న సచివాలయ ఉద్యోగులు , ఇటీవల సచివాలయ ప్రాంగణం లో సమావేశమై తమ నిరసనను తెలియజేశారు  .  రాజధాని తరలింపు అంశంపై ఇంతవరకు ఏ ఒక్క కమిటీ సంప్రదించలేదని పేర్కొంటూ ఉద్యోగులు తమ అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తం చేశారు .  దీనితో  ఉద్యోగుల నుంచి నిరసనలు వెల్లువెత్తే అవకాశాలు లేకపోలేదని భావిస్తోన్న జగన్ సర్కార్ , ఉద్యోగులను తాయిలాలను ప్రకటించి వారిని మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది .

 

ఈ మేరకు సచివాలయ ఉద్యోగులపై వరాలజల్లు కురిపించాలని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన  హైపవర్ కమిటీ సిఫార్సు చేసినట్లు సమాచారం . అమరావతి నుంచి రాజధానిని విశాఖ కు తరలిస్తున్న నేపధ్యం లో విశాఖలో ప్రతి సచివాలయ ఉద్యోగికి తక్కువ ధరకే 200 గజాల ఇంటి స్థలాన్ని కేటాయించడంతోపాటు , ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది . ప్రతి ఉద్యోగికి ఇల్లు కట్టుకునేందుకు 25 లక్షల హౌసింగ్ రుణాన్ని ఇవ్వనున్నట్లు సమాచారం . ఇక అమరావతి నుంచి విశాఖ కు ఉద్యోగులు మారనున్న నేపధ్యం లో ప్రతి ఒక్క ఉద్యోగికి 50 వేలనుంచి లక్ష రూపాయల వరకు రవాణా చార్జీలు కూడా చెల్లించాలని జగన్ సర్కార్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది .

 

సచివాలయ ఉద్యోగుల  పిల్లలకు ఏ స్కూల్ అంటే ఆ స్కూల్ లో అడ్మిషన్ లభించే విధంగా ప్రభుత్వపరంగా  చర్యలు తీసుకోవడమే కాకుండా , కాలేజీల్లోనూ అడ్మిషన్ ఇప్పిస్తామని హామీ ఇవ్వనున్నారని సమాచారం . ప్రభుత్వం ప్రకటించే వరాలతో సచివాలయ ఉద్యోగులు, రాజధాని తరలింపు పై పెద్దగా అసంతృప్తిని వ్యక్తం చేసే అవకాశాలుండవని ప్రభుత్వ పెద్దలు అంచనా వేస్తున్నారు . చూడాలి మరి .  

మరింత సమాచారం తెలుసుకోండి: