తెలంగాణ లో  మున్సిపోల్స్ ను కమలనాథులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు . ఈ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న అన్ని మున్సిపాలిటీలు , కార్పొరేషన్లలో పోటీ చేయనున్నట్లు ఇప్పటికే పార్టీ నాయకత్వం ప్రకటించింది . పట్టణ ప్రాంతాల్లో ఇన్నాళ్లు బీజేపీ తన ఉనికిని చాటుతున్న విషయం తెల్సిందే . అయితే బీజేపీ అన్ని స్థానాల్లో పోటీ చేసిన గెలిచేది ఎన్ని అన్న ప్రశ్న తలెత్తుతోంది . ఒకవేళ మున్సిపోల్స్ లో బీజేపీ  ఆశించిన స్థాయి లో  వార్డులు , డివిజన్ స్థానాల్లో  విజయం సాధించలేకపోతే , ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగలడం ఖాయమని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు .

 

రాష్ట్రం లో టీఆరెస్ కు తామే ప్రత్యామ్నాయమని చెబుతోన్న బీజేపీ , ఇప్పటి వరకు ఎన్నికల్లో ఆ దిశగా సత్తా చాటుకోవడంలో విఫలమవుతూ వస్తోంది .  గతం లో అసెంబ్లీలో   ఐదు స్థానాలుండగా , ఇటీవల జరిగిన ముందస్తు ఎన్నికల్లో ఒక్క స్థానానికి పరిమితమై తన ఉనికిని ప్రశ్నార్ధకం చేసుకుంది . అయితే లోక్ సభ ఎన్నికల్లో అనూహ్యంగా నాలుగు స్థానాలను గెల్చుకుని అందర్నీ ఆశ్చర్యపరిచిన కమలనాథులు , అదే ఊపును స్థానిక సంస్థల ఎన్నికల్లో కొనసాగించలేకపోయారు . ఇక ఇటీవల జరిగిన హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో బీజేపీ కి వచ్చిన ఓట్ల శాతం కూడా ఆ పార్టీ నాయకత్వాన్ని ఆత్మరక్షణలో పడేసింది . ఈ నెలాఖరులో జరగనున్న మున్సిపోల్స్ లో బీజేపీ , టీఆరెస్ కు ఎంతవరకు గట్టి పోటీనిస్తుందన్నది ప్రశ్నార్ధకంగా మారింది .

 

మున్సిపోల్స్ లో    బీజేపీ అసలు తమకు పోటీయే కాదని , తమ ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ అంటూ టీఆరెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొనడం పరిశీలిస్తే , బీజేపీ ని ఆ పార్టీ లైట్ గా తీసుకుంటున్నట్లు స్పష్టం అవుతోంది . టీఆరెస్ కు   అసలైన ప్రత్యామ్నాయమని తామేనంటూ బీజేపీ ఢంకా బజాయించి చెబుతోంది . చూడాలి మరి ... మున్సిపోల్స్ లో సత్తా చాటుతుందా ? లేదా ?? .

మరింత సమాచారం తెలుసుకోండి: