మచిలీపట్నంలో మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్వహించిన బహిరంగసభ జనం లేకపోవడంతో వెలవెలబోయింది. చంద్రబాబు నాయుడు విజయవాడ బెంజ్ సర్కిల్ నుండి కంకిపాడు, ఉయ్యూరు, పామర్రు మీదుగా బందరుకు చేరుకున్నారు. మచిలీపట్నంలో చంద్రబాబు నిర్వహించిన సభకు చాలా తక్కువ సంఖ్యలో జనం హాజరయ్యారు. 
 
సభకు భారీ సంఖ్యలో జనం హాజరు కాకపోవటంతో చంద్రబాబు భిక్షాటన పేరుతో కోనేరు సెంటర్ నుండి మున్సిపల్ కార్యాలయం వరకు పాదయాత్ర చేశారు. జోలె పట్టిన చంద్రబాబు ఒక వృద్ధురాలి దగ్గరకు వెళ్లి డబ్బులు వేయాలని అడిగారు. ఆ వృద్ధురాలు అందుకు బదులుగా నీకు డబ్బులు ఎందుకు వేయాలి...? ఏం చేశావని నీకు డబ్బులు వేయాలి..? అని ప్రశ్నించింది. 
 
చంద్రబాబు అమరావతి కోసం డబ్బులు వేయాలని వృద్ధురాలిని అభ్యర్థించాడు. ఆ మాట వినగానే వృద్ధురాలు ఏమైనా కట్టావా...? అని ప్రశ్నించడంతో షాక్ అవ్వడం చంద్రబాబు వంతయింది. మహిళ అలా చెప్పడంతో చంద్రబాబు అక్కడినుండి వెళ్లిపోయారు. మరోవైపు సభలో చంద్రబాబు అమరావతికి జై కొట్టాలని సభకు హాజరైన వారిని పదేపదే అభ్యర్థించాడు. కానీ జనం నుండి చంద్రబాబు ఆశించిన స్పందన మాత్రం కరువైంది. 
 
చంద్రబాబు సభలో మాట్లాడుతూ ఉత్తరాంధ్రవాసులు రాజధాని కావాలని కోరుకోవటం లేదని అన్నారు. అమరావతి నిర్మాణానికి లక్షా 10 వేల కోట్ల రూపాయలు కావాలని కానీ అంత డబ్బు ఇప్పటికిప్పుడు అవసరం లేదని చంద్రబాబు అన్నారు. బంగారు బాతు గుడ్లు పెట్టే అమరావతిని చంపాలని చూస్తున్నారని చంద్రబాబు అన్నారు. పైసా ఖర్చు లేకుండా రాజధానిని నిర్మించుకోవచ్చని ఆ తెలివితేటలు వారికి లేకపోవడం వలనే ఈ పరిస్థితి ఏర్పడిందని వ్యాఖ్యలు చేశారు. మీ జీవితాలను అధికారంలో ఉన్న ప్రభుత్వం నాశనం చేస్తూ ఉండటం వలనే రోడ్డెక్కానని చంద్రబాబు అన్నారు. అమరావతి జేఏసీ నేతలకు చంద్రబాబు జోలె పట్టి సేకరించిన 3.10 లక్షల రూపాయలను అందజేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: