బాధగానే ఉన్నా ఆరోపణలో  లేకపోతే విమర్శలు  చేయక తప్పటం లేదు సుజనా చౌదరికి. చంద్రబాబునాయుడుపై కేంద్ర మాజీ మంత్రి సుజనా మాట్లాడుతూ చంద్రబాబు వైఫల్యాల వల్లే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినట్లు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారింది.  జగన్ పై ఆరోపణలు చేయటంలో ఉత్సాహం చూపే సుజనా ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ గురించి ఆరోపణలు చేయాలంటే తెగ బాధపడిపోతుంటారు.

 

ఎందుకంటే ఆర్ధిక నేరారోపణలు ఎదుర్కొంటున్న సుజనాకు రాజకీయంగా బతుకునిచ్చింది చంద్రబాబే. వార్డులో కౌన్సిలర్ గా కూడా గెలుస్తాడో లేదో తెలీని సుజనా తెలుగుదేశంపార్టీలో ఉన్నంత కాలం రాష్ట్రంలో ఓ వెలుగు వెలిగారు.  బ్యాంకులను మోసగించి  వేల కోట్ల రూపాయలను దోచేశాడంటూ సిబిఐ, ఐటి, ఈడి లు ఉమ్మడిగా దాడులు చేసి కేసులు కూడా నమోదు చేశాయి. కేంద్రమంత్రిగా ఉన్నపుడు నాంపల్లి కోర్టు నుండి అరెస్టు వారెంట్ అందుకున్న గొప్పోడీయన.

 

అటువంటి సుజనా మొన్నటి ఎన్నికల్లో రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి, కేంద్రంలో మళ్ళీ నరేంద్రమోడినే ప్రధానమంత్రి కావటంతో పాటు ముందు జాగ్రత్తగా బిజెపిలోకి ఫిరాయించారు. బిజెపిలోనే ఉన్నా చంద్రబాబు ప్రయోజనాలే ధ్యేయంగా రక్షణ కోసమే మాట్లాడేవారు. కానీ బిజెపి అగ్ర నాయకత్వం నుండి అక్షింతలు పడ్డాయో ఏమో ? తప్పదన్నట్లుగా అప్పుడప్పుడు చంద్రబాబును కూడా విమర్శించటం, ఆరోపణలు  చేయటం మొదలుపెట్టారు.

 

నిజానికి చంద్రబాబును విమర్శించాలన్నా, ఆరోపణలు చేయాలన్నా ఈ రాజ్యసభ ఎంపి తెగ బాధిపడిపోతుంటారు. కానీ బిజెపిలో చేరినందుకు పాతివ్రత్యం నిరూపించుకోవాలి కదా ? అందుకనే తాజాగా అధికారంలో ఉన్నపుడు చంద్రబాబు విఫలమయ్యారంటూ ఆరోపించారు.

 

పరిపాలనలో చంద్రబాబు విఫలమయ్యారు కాబట్టే జగన్ గెలిచాడని బాధపడిపోతూ చెప్పారు. పరిపాలన విషయంలో జగన్ కు బుద్ధులు చెబుతున్నారు. అభివృద్ధి అంటే ఏమిటో జగన్ కు వివరించారు. మరి ఇదే బుద్ధులు ఐదేళ్ళలో చంద్రబాబుకు ఎందుకు చెప్పలేదు ?  ప్రజలతో ఎలా నడుచుకోవాలనే విషయంలో  చంద్రబాబు హయాంలో ఎప్పుడైనా పోలీసులకు  సుజనా క్లాసులు పీకారా ?  పైగా కేంద్రాన్ని బూచిగా చూపించి జగన్ ను భయపెట్టాలని ప్రయత్నిస్తుండటమే విచిత్రంగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: