తెలంగాణ రాజకీయాల్లో చిత్ర విచిత్రాలు ఎన్నో చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా బలమైన పార్టీగా ఉన్న టిఆర్ఎస్ ఈ మున్సిపల్ ఎన్నికల్లో మరోసారి గట్టెక్కిస్తాయని అంతా భావిస్తుండగా కొన్ని ఊహించని పరిణామాలు ఆ పార్టీ గెలుపుపై సందేహాలను కలిగిస్తున్నాయి. అసలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉనికి లేదని, మరికొద్ది రోజుల్లో ఆ పార్టీ 
కనుమరుగయిపోతుంది అనే సంకేతాలు వెలువడుతున్న పరిస్థితుల్లో ఇప్పుడు అనూహ్యంగా టిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు పెరగడం టిఆర్ఎస్ లో ఆందోళన పెంచుతున్నాయి. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల కారణంగా కాంగ్రెస్ లోకి వలసలు జోరందుకున్నాయి. టిఆర్ఎస్ లో టికెట్ దక్కని నాయకులంతా అధికార పార్టీ కాంగ్రెస్ లో  చేరిపోతున్నారు. 


కాంగ్రెస్ నుంచి బీ ఫామ్ తెచ్చుకుంటున్నారు. అలా కుదరని వారు స్వతంత్ర అభ్యర్థులుగా రంగంలోకి దిగుతున్నారు. నిన్న, మొన్నటి వరకు తమ పార్టీ నాయకులుగా ఉన్నవారు ఇప్పుడు తమకు ప్రత్యర్థులుగా మారడాన్ని టిఆర్ఎస్ సీరియస్ గా తీసుకుంది. తక్షణమే మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ విషయంపై దృష్టి పెట్టి నష్ట నివారణ చర్యలకు దిగాల్సిందిగా అధినేత కేసీఆర్ సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. అసలు టిఆర్ఎస్ లో ఈ పరిస్థితి రావడానికి కారణాలు పరిశీలిస్తే, రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ ఇతర పార్టీల నాయకులను చేర్చుకోవడంపైనే ప్రధానంగా దృష్టి పెట్టింది. దీనిలో భాగంగా టీడీపీ, కాంగ్రెస్ నుంచి బలమైన నాయకులను, ద్వితీయ శ్రేణి నాయకులను టిఆర్ఎస్ లో చేర్చుకుంటూ వెళ్ళింది. 


భారీగా చేరికలు పూర్తవడంతో మొదట్లో టిఆర్ఎస్ హుషారుగా కనిపించింది. అయితే ఆ తర్వాత నుంచి కొత్తగా వచ్చి చేరిన నాయకులకు, పాత నాయకులకు మధ్య ఆధిపత్య పోరు తీవ్రం కావడంతో అసలు సమస్య మొదలైంది. తరచుగా తెలంగాణ మొత్తం ఇదే  సమస్యలు వస్తుండడంతో ఆ పార్టీకి  తలనొప్పిగా మారింది. ఇప్పుడు ఈ మున్సిపల్ ఎన్నికల్లో అదే పరిస్థితి ఏర్పడడంతో ఎన్నికలపై ఆ ప్రభావం ఎక్కడ ఉంటుందో అని ఆందోళనలో ఉంది టిఆర్ఎస్.  

మరింత సమాచారం తెలుసుకోండి: