సార్వ‌త్రిక ఎన్నిక‌లంత ఆస‌క్తిని రేకెత్తిస్తూ క్షేత్ర‌స్థాయిలో ఉత్కంఠ క‌లిగిస్తున్న పుర‌పాల‌క ఎన్నిక‌ల్లో కీల‌క ఘ‌ట్టం పూర్త‌యింది. అయితే, అస‌లు ఘ‌ట్టం ముందుంది. రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో 120 మున్సిపాలిటీల్లోని 2,727 వార్డులకు, తొమ్మిది కార్పొరేషన్లలోని 325 వార్డులకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ శుక్రవారం సాయంత్రంతో ముగిసింది. నామినేషన్లకు చివరి రోజు కావడంతో చాలామంది అభ్యర్థులు బారులు తీరారు. మ‌రోవైపు, ప్ర‌చారం జోరందుకుంది. కాగా, దాఖలైన నామినేషన్లను అధికారులు శనివారం పరిశీలించనున్నారు. 14వ తేదీ సాయంత్రం 5 గంటలకు అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించనున్నారు.

 


మున్సిపల్‌ ఎన్నికల నామినేష‌న్ల దాఖ‌లు చివ‌రి రోజు నేప‌థ్యంలో శుక్ర‌వారం ఉదయం 10.30 గంటలకు ముందునుంచే కార్యాలయాలకు చేరుకున్నారు. చివరి రోజు శుక్రవారం మొత్తం 21,850 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో 574 ఆన్‌లైన్‌ ద్వారా వచ్చాయి. ఆన్‌లైన్‌ నామినేషన్లలో నిజామాబాద్‌ జిల్లా మొదటిస్థానంలో నిలిచింది. ఇక్కడ శుక్రవారం ఒక్కరోజే 304 నామినేషన్లు ఆన్‌లైన్‌ ద్వారా వేశారు. తొలి రోజు బుధవారం 967 నామినేషన్లు, గురువారం 5,689 సహా మొత్తం మున్సిపాలిటీల్లో 28,506 నామినేషన్లు దాఖలయ్యాయి. 

 


నామినేషన్ల ఘట్టం ముగియడంతో నాయకులు ప్రచారంపై దృష్టి సారించారు. శుక్రవారం వరకు అభ్యర్థుల ఎంపిక, ఏ, బీ ఫారాలు, సమర్పణ తదితర ప్రక్రియ దాదాపుగా అన్నిచోట్ల ముగించారు. ఈ నెల 22న ఎన్నికలు జరుగనుండగా ప్రచారాన్ని ఈ నెల 20వ తేదీతో ముగించాల్సి ఉంది. శని, ఆదివారం కల్లా ప్రతి అభ్యర్థి ప్రచారంపై దృష్టి పెట్టేలా పార్టీల నేత‌ల‌ నుంచి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ప్రతి ఓటరును కలిసి ఓటు అడగాలని నాయ‌కుల‌కు పార్టీ పెద్ద‌లు సూచించారు. 

 

సమావేశాలు, సభల కంటే ఇంటింటి ప్రచారంపైనే అధిక దృష్టి పెట్టారు. పట్టణ ప్రాంత ఎన్నికలైనందున సోషల్‌మీడియా ప్రభావం అధికంగా ఉండటంతో ఆ కోణంలోనూ ప్రచారంచేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: