ప‌రిపాల‌న వికేంద్రీక‌ర‌ణ పేరుతో నవ్యాంధ్ర రాజధాని అమరావతి నుంచి మూడు ప్రాంతాల్లో ప‌రిపాల‌న కొన‌సాగించేందుకు ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ప్ర‌య‌త్నం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే, దీనిపై అమ‌రావ‌తి ప్రాంతంలో ఆందోళ‌న‌లు కొన‌సాగుతున్నాయి. అమ‌రావ‌తినే రాజ‌ధానిగా కొనసాగించాలని గడిచిన 24 రోజులుగా ఆ ప్రాంత రైతులు, వివిధ రాజకీయ పక్షాలు చేస్తున్న ఆందోళన తారాస్థాయికి చేరింది. ముఖ్యంగా శుక్రవారం ఉద్దండరాయుని పాలెం నుంచి రైతులు, మహిళలు విజయవాడ కనకదుర్గమ్మ వారి గుడికి పాదయాత్ర చేపట్టగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ ప‌రిణామాలు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. తాజాగా, వీటిపై సీనియ‌ర్ రాజ‌కీయ‌వేత్త‌, బీజేపీ ఎంపీ సుజ‌నా చౌద‌రి ఘాటుగా స్పందించారు.

 


విజ‌య‌వాడ‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మహిళలపై దాడి‌ చేసి,  అరెస్టు చేయడం అన్యాయమ‌ని పేర్కొన్నారు. ఒంగోలులో మహిళల పై మగ పోలీసులు దాడి‌చేయడం కలచి వేసిందన్నారు. మనం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నామా ఆఫ్ఘనిస్థాన్‌లో ఉన్నామా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. కుల, మతాలకు అతీతంగా అందరూ ఉద్యమం చేసి ఈ దారుణాలు ఆపాలి అని కోరారు.అమ్మవారికి మొక్కులు కూడా చెల్లించుకోకుండా అడ్డుకున్నారు. అవసరం లేకున్నా 144 సెక్షన్ పెడుతున్నారు. ఏ నిబంధనలు ప్రకారం అర్ధరాత్రి పోలీసులు ఇళ్లకు వెళుతున్నారు? కులం, వివరాల కోసం  ఇబ్బందులు పెడతారా? వైసిపి ర్యాలీలకు ఎలా అనుమతి ఇస్తున్నారు? రాష్ట్రంలో ఇంత జరుగుతుంటే డిజిపి ఏం‌ చేస్తున్నారు? డీజీపీ రాజ్యాంగ బద్దంగా వ్యవహరించాలి. లేదంటే ఆయనఇబ్బందులు ఎదుర్కోక తప్పదు ` అని వ్యాఖ్యానించారు.

 

ఆరు నెలల్లో ఆడపడుచుల‌ విశ్వాసం కోల్పోయింది. వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు కూడా మాట్లాడలేక‌ సిగ్గుతో తలదించుకుంటున్నారు. ఇటువంటివి ఆపలేకపోతే మనం పదవుల్లో ఉండటం ఎందుకు? మా పార్టీ సిద్దాంతం ఏదైనా .. ప్రజలకు జరుగుతున్న అన్యాయంపై పోరాటం చేస్తాను. రాష్ట్రంలో నేరాలు, ఘోరాలు పెరిగిపోయాయి. ఇవన్నీ‌ చూస్తూ .. మౌనంగా ఉండలేను. ప్ర‌స్తుత నిర్ణ‌యాల‌ను సరి‌ చేయలేకపోతే నా పదవులు నాకు అనవసరం. పార్టీ సహకారం లేకున్నా.. వ్యక్తిగతంగా అయినా పోరాడతా` అని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: