ఈఎస్ఐ పేరెత్తితేనే జనం భయపడుతున్నారు. ఇప్పటికే అక్కడ జరిగిన అవినీతి బాగోతంలో మాజీ డైరెక్టర్ దేవికారాణి తో పాటూ చాలా మందిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. అందుకే ఈఎస్ఐని గాడిన పెట్టేందుకు, డైరెక్టర్‌గా సీనియర్ ఐఏఎస్ అహ్మద్ నదీమ్ ను నియమించింది తెలంగాణ ప్రభుత్వం. ఆయన మాత్రం డైరెక్టర్ పోస్ట్ ను ముళ్ల కిరీటంగా ఫీలవుతున్నారు. ప్రభుత్వం ఎంతో నమ్మకంతో బాధ్యతలు అప్పగిస్తే ఆయన మాత్రం.. ఆ వైపు చూసేందుకే భయపడుతున్నారు. 

 

ఈఎస్ఐలో బయటపడిన భారీ స్కాంలో.. ఇప్పటికే మాజీ డైరెక్టర్ దేవికా రాణితో పాటూ మరికొందరు అరెస్ట్ కాగా.. చాలా మందికి మెమోలు అందాయి. అయితే ఈఎస్ఐని గాడిలో పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం... సమర్దుడంటూ సీనియర్ ఐఏఎస్ నదీమ్‌కి బాధ్యతలు అప్పగించారు. ఆయనేమో.. పూర్తిస్థాయి బాధ్యతలు తీసుకోకపోగా.. గతంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఓ అదికారినే ఇంఛార్జిగా పెట్టారు. 

 

ఈఎస్ఐ లో జరిగిన కోట్ల రూపాయల కుంభకోణంలో డైరెక్టర్ పేషీ నుంచి ఫార్మసిస్టుల వరకు అరెస్టులు జరుగుతున్నాయి.  దీంతో ఈఎస్‌ఐలో రోగులకు సరైన వైద్యం అందడం లేదు. మందుల కొరత తీవ్రంగా ఉంది. గుండె, క్యాన్సర్, బిపి, షుగర్ లాంటి దీర్ఘకాలిక రోగాలతో ఇబ్బందులు పడుతున్న వారికి పరిస్థితి మరీ ఘోరం. అధికారులేమో స్పందించరు, డైరెక్టరేమో కార్యాలయానికి రారు. 

 

నదీమ్ ప్రస్తుతం లేబర్ శాఖ కమిషనర్ గా ఉన్నారు. అదనంగా ఈఎస్‌ఐ డైరెక్టర్‌గా బాధ్యతలు ఇచ్చినా.. ఆయన మాత్రం లేబర్ శాఖకే పరిమితమవుతున్నారు. ఈఎస్ఐ కార్యాలయానికి రారు .. అక్కడి సమస్యలు పట్టించుకోరు.. జాయింట్ డైరెక్టర్ గా ఉన్న వెంకట స్వామిని తప్ప మరొకరిని ఆయన నమ్మరు. సంతకాల కోసం ఫైల్స్ అన్నీ లేబర్ శాఖా కార్యాలయానికే తీసుకెళ్తున్నారు. ఆస్పత్రిలో నెలకొన్న ఇబ్బందులపై ఎన్నిసార్లు లేఖలు రాసినా.. ఆయనలో కదలిక మాత్రం లేదు.

 

అయితే ప్రస్తుతం ఈఎస్‌ఐలో డైరెక్టర్ అసమర్దత వల్ల గతంలో జరిగిన తప్పులే మళ్లీ జరుగుతున్నాయి. అవినీతిలో కూరుకుపోయి.. విచారణ ఎదుర్కొంటున్న వారికే కీలకమైన బాధ్యతలు అప్పజెప్పటం చూస్తుంటే  అనుమానాలు రేకెత్తుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈఎస్ఐ ఆస్పత్రుల్లో మందుల కొరత తీవ్రంగా ఉంది. 6నెలల నుంచి కనీసం అత్యవసర మందులు సైతం రోగులకు అందడం లేదు. బిపి, షుగర్ వంటి రోగాలకు కూడా మందులు లేవంటూ తిప్పి పంపుతున్నారు. ఇంత జరుగుతున్నా ఏ అధికారీ నోరు మెదపడం లేదు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: