ఇది ఇప్పటి సంగతి కాదు.. దాదాపు ఐదేళ్ల క్రితం మాట. కానీ ఈ కేసులో తీర్పు ఇప్పుడు వచ్చింది. గృహిణిని బెదిరించి అత్యాచారం చేసినందుకు కోర్టు నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అసలేం జరిగిందంటే... వరంగల్ జిల్లా చిట్యాల్ మండలం వెంకటరావుపల్లికి చెందిన అశోక్ యూసుఫ్ గూడ లో ఉంటూ జూబ్లిహిలో కార్పొరేట్ ఆస్పత్రిలో ఫార్మసీ ట్రైనీగా పనిచేస్తున్నాడు.

 

అశోక్ 2015 సెప్టెంబరు 18న రాత్రి సనత్ నగర్ పోలీసు - రాణా పరిధిలోని కాలనీలో గృహిణి ఒంటరిగా ఉన్న ఇంట్లోకి చొరబడ్డాడు. పదునైన కత్తితో బెదిరించి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ప్రతిఘటించిన ఆమెను కత్తితో దాడి చేసి గాయపర్చి అత్యాచారం చేశాడు. ఆమె అరుపులు విని స్థానికులు అక్కడికి చేరుకునేసరికి తన దుస్తులు అక్కడే
పడేసి పరారయ్యాడు. అక్కడే నిందితుడు తప్పు చేశాడు.

 

సంఘటనా స్థలంలో లభించిన దుస్తుల్లో దొరికిన గుర్తింపు పత్రం ఆధారంగా పోలీసులు నిందితుడిని గుర్తించారు. సమాచారం అందుకున్న సనత్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి వైద్య పరీక్షల నిమిత్తం బాధిత మహిళను గాంధీ ఆస్పత్రికి తరలించారు. అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. అనంతరం పోలీసులు రాజేంద్రనగర్ 8వ మెట్రోపాలిటన్ మెజిస్టేట్ లో బాధిత మహిళ వాంగ్మూలాన్ని రికార్డు చేయించారు.

 

సమగ్రమైన సాక్ష్యాలు, వైద్యపరమైన ఆధారాలతో కూడిన అభియోగ పత్రాన్ని కోర్టులోదాఖలు చేశారు. కేసు విచారించిన రంగా రెడ్డి జిల్లా ఒకటో అదనపు ప్రత్యేక మహిళా సెషన్స్ కోర్టు ఈ మేరకు శుక్రవారం తీర్పు వెలువరించింది. ఇంట్లోకి చొరబడి కత్తితో బెదిరించి గృహిణిపై అత్యాచారానికి ఒడిగట్టిన నిందితుడికి న్యాయస్థానం పదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.1,000 జరిమానా విధించింది. మొత్తానికి నిందితుడికి శిక్ష పడింది. శిక్ష పడటం ఆలస్యమైనా నిందితుడు మాత్రం తప్పించుకోలేకపోయాడు. చట్టం చేతులు చాలా పెద్దవని మరోసారి రుజువైంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: