పత్రికల్లో, సామాజి మాధ్యమాల్లో ఇటీవల తరచూ ఇలాంటి ప్రకటనలు కనిపిస్తున్నాయి. మీకు ఆదాయం సరిపోవడం లేదా..? తేలిగ్గా ప్రతినెలా అదనంగా రూ.40వేలు
సంపాదించాలని ఉందా..? అంటూ ప్రకటనలు కనిపిస్తాయి. అలా సంపాదించాలనుకుంటే సింపుల్ గా మాకు ఫోన్ చేయండంటూ వివరాలు ఇస్తారు.

 

ఇలా ముగ్గులో దింపి.. లక్షల రూపాయలు కాజేస్తున్న ముఠాల మోసాలు వెలుగు చూస్తున్నాయి. తస్మాత్ జాగ్రత్తగా ఉండండి.. ఇలాంటి వారిని నమ్మి ఎట్టి పరిస్థితుల్లోనూ ముందు డబ్బు చెల్లించకండి.. చెల్లించారంటే ఇక అంతే సంగతులు. వీరు ఎలా మోసగిస్తారో తెలుసా..?



ముందుగా మొబైలకు ఎస్ఎంఎస్ పంపిస్తారు. పర్యావరణంపై స్పృహ పెరుగుతున్న నేపథ్యంలో కాగితం ప్లేట్లకు భారీగా గిరాకీ ఉంటుందంటూ వల వేస్తారు. ఆసక్తి ఉంటే ఫలానా నంబర్లకు కాల్ చేయాలంటూ సూచిస్తారు. మనం ఇదంతా నిజమేనని నమ్మి, ఫోన్ కలిపామో ఇక అంతే సంగతులు. వాట్సాప్ ద్వారా రకరకాల వీడియోలు పంపిస్తారు. తిరుపతి, ఢిల్లీలో నంబర్ వన్ కంపెనీ అంటూ వల వేస్తారు.

 

1000 పేట్లకు గాను రూ.400 నుంచి రూ.500 వరకు చెల్లించి మేమే తీసుకెళ్తాం.. మీరు తయారు చేసి సిద్ధం చేస్తే చాలు అంటారు. ఎక్కడా అనుమానం రాకుండా జాగ్రత్త పడతారు. ఈ యంత్రాలపై ప్రత్యేకంగా తయారీపై శిక్షణ ఇచ్చేందుకు, యంత్రాల నిర్వహణలో సాయం చేసేం దుకు ఒకరిద్దరు అనుభవజ్ఞులను మీ దగ్గరికి పంపిస్తామంటూ నమ్మబలుకుతారు. ఒక్కసారి ఒప్పందం చేసుకుంటే అయిదేళ్ల వరకు అమల్లో ఉంటుందని నమ్మబలుకుతారు.

 

వీళ్ల బిల్డప్ చూసి మనం నిజమే అనుకుంటాం. సరే అని.. ఫోన్ చేస్తాం.. కొంత ముందు పెట్టుబడి పెట్టాలంటే.. సరే అని వాళ్ల ఎకౌంట్లో సొమ్ము వేస్తాం. ఇక అంతే.. ఆ తర్వాత ఆ ఫోన్లు పనిచేయవు.. ఆ వ్యక్తులు స్పందించరు. అప్పటికి గానీ మనం మోసపోయామన్న సంగతి మనం తెలుసుకోలేం. ఇలాంటి మోసాలు చాలా జరుగుతున్నాయి. అందుకే మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ముందు డబ్బు చెల్లించకండి.. మోసపోకండి. తస్మాత్ జాగ్రత్త.

మరింత సమాచారం తెలుసుకోండి: