అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు  ఫీవర్ వదలక ముందే విజయనగరం జిల్లాలో మరోసారి ఎన్నికల సందడి ఆరంభం అయ్యింది. జిల్లాలో జెడ్పీ ,ఎంపీటీసీ, పంచాయితీ  ఎన్నికలకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఇప్పటికే రిజర్వేషన్ లు ఖరారు చేసి గెజిట్ నోటిఫికేషన్ సైతం విడుదల చేశారు . దీంతో చలికాలంలో సైతం జిల్లాలో రాజకీయాలు  వేడెక్కుతున్నాయి. 

 

విజయనగరం జిల్లాలో మొన్నటి అసెంబ్లీ.. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలులాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం మరో సారి తమ సత్తా చాటడానికి వైసీపీ సిద్దమవుతోంది. పోయిన చోటే వెతుక్కునే పనిలో ఉన్న టీడీపీ నేతలు, ఎలాగైనా తమసత్తా చాటేందుకు పావులు కదుపుతున్నారు.  2014 ఎన్నికల్లో జిల్లాలో టీడీపీ ఆధిపత్యం ప్రదర్శించింది. తొమ్మిది ఎమ్మెల్యేలకు గాను ఆరు చోట్ల టీడీపీ గెలుపొందగా మూడు స్థానాల్లో  వైసీపీ ఎమ్మెల్యేలు గెలిచారు. ఎంపీగా టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు గెలుపొంది,  కేంద్ర మంత్రి సైతం అయ్యారు. ఇక ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేల్లో బొబ్బిలి నుంచి గెలిచిన సుజయ్ కృష్ణ రంగారావు  టీడీపీలోకి జంప్ అయి మంత్రి సైతం అయ్యారు. అదే సంవత్సరం జరిగిన స్థానిక సంస్థల్లో సైతం టీడీపీ భారీగానే  గెలిపొందింది. 

 

2014 స్థానిక ఎన్నికల్లో 34 జెడ్పీ స్థానాలకు గాను  24 టీడీపీ, 10 స్థానాలు వైసీపీ గెలుపొందాయి. జెడ్పీ చైర్మన్ పదవి ఎస్టీ మహిళకు కేటాయించడంతో మాజీ ఎమ్మెల్యే , టీడీపీ సీనియర్ నేత శోభా హైమావతి కూతురైన శోభా స్వాతి రాణిని జెడ్పీ చైర్మన్ ను చేసింది టీడీపీ. ఇక జిల్లాలోని 549 ఎంపీటీసీలకు గాను  టీడీపీ 297 , వైసీపీ  169 స్థానాలు కైవశం చేసుకోగా  కాంగ్రెస్ 60, ఇండిపెండెంట్లు 22 , బిజేపి నుండి ఒకరు ఎంపీటీసీగా గెలుపొందారు . జిల్లాలోని 34 మండలాలకు గానూ  26 మండలాధ్యక్షులను టీడీపీ గెలుపొందగా , 8 ఎంపీపీలతో వైసీపీ  సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 

 

2019లో విజయనగరం జిల్లా రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. జిల్లాలోని 9 అసెంబ్లీ స్థానాలతో పాటు  జిల్లాకు అనుబంధంగా ఉన్న విజయనగరం , అరకు , విశాఖ పార్లమెంట్ స్థానాలు వైసీపీ క్లీన్ స్వీప్ చేసి చరిత్ర సృష్టించింది. రాజకీయ ఉద్దండులైన అశోక్ గజపతి రాజు, బొబ్బిలి రాజు సుజయ్ కృష్ణ రంగారావు సైతం ఓటమి పాలైయ్యారు. దీంతో జిల్లాలో టీడీపీ పట్టు పూర్తిగా కోల్పోయింది. లేటెస్ట్ గా స్థానిక సమరానికి క్లియరేన్స్ రావడంతో రెండు పార్టీల్లో పోలిటికల్ హీట్ మొదలైంది .. అసెంబ్లీ ఫలితాల సీన్ మరో సారి రిపీట్ చేయాలని వైసీపీ  స్కేచ్ వేస్తుండగా, ఎలాగైనా పట్టు నిలబెట్టుకునేందుకు టీడీపీ సిద్దమవుతోంది. 


 
జెడ్పీ చైర్మన్ పదవిని తొలుత ఎస్సీ మహిళకు రిజర్వ్ చేయడంతో కొంత షాక్ కి గురయ్యారు వైసీపీ సీనియర్ నేతలు. అయితే తాజాగా మారిన రిజర్వేషన్లలో అన్ రిజర్వుడ్ కోటా లోకి మార్చడంతో ఎలక్షన్ హడావిడి ఊపందుకుంది. బొత్స  కుటుంబం ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలపై గ్రౌండ్ వర్క్ పూర్తి చేసుకుంది. వారి కుటుంబం నుంచే మరో కీలక నేత జెడ్పీ చైర్మన్ రేస్ లో  నిలిచే అవకాశం ఉంది. మరో వైపు  జిల్లా మంత్రులైన బొత్స సత్యనారాయణ , డిప్యూటి సీఏం పుష్ప శ్రీవాణిలు లను ప్రసన్నం చేసుకునేందుకు అశావాహులు క్యూ కడుతున్నారు . 

 

జిల్లాలోని 34 జెడ్పీటీసీలకు గానూ బీసీలకు 18 సీట్లు , ఎస్సీలకు 4, ఎస్టీ కేటగరిలో 4, అన్ రిజర్వుడ్ కేటగిరిలో 8 సీట్లను రిజర్వ్ చేసింది ఎన్నికల కమిషన్. ఎంపీపీలు సైతం 26 బీసీలకు, ఎస్సీలకి 4, ఎస్టీలకు 4 స్థానాలు కేటాయించడంతో ఆయా వర్గాల వారు పోటీకి సన్నద్దమవుతున్నారు .  మరో వైపు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న  మంత్రి బొత్సా , డిప్యూటి సిఏం పుష్ప శ్రీవాణిలు.. స్థానిక ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అభ్యర్దుల ఎంపికపై తీవ్రంగా కసరత్తులు చేస్తున్నారు గెలుపు గుర్రాలకే సీట్లు కేటాయించే విదంగా ఎమ్మెల్యేలతో నివేదికలు తెప్పించుకుంటున్నారు. 

 

ప్రభుత్వం ఏర్పడిన ఆరునెలల్లో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని, ఖచ్చితంగా స్థానిక ఎన్నికల్లో తమకే ప్లస్ అవుతుందని వైసీపీ నేతలు ధీమాగా ఉన్నారు. ఇసుక కష్టాలు, ధాన్యం కోనుగోళ్లు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని ,ఇవి తమకి కలిసి వస్తాయని  టీడీపీ భావిస్తోంది . మొత్తానికి అటు వైసీపీ, ఇటు టీడీపీకి స్థానిక పోరు ప్రతిష్టాత్మకంగా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: