చారిత్రక ప‌ర్యాట‌క కేంద్రమైన కడప జిల్లాలో గండికోట ఉత్సవాల‌ు వైభవంగా జరుగుతున్నాయి. ఇక్కడి చారిత్రక సంప‌ద‌ను ప్రపంచానికి చాటిచెప్పేందుకు గండికోట ఉత్సవాలు జరుగుతున్నాయి.  రెండురోజుల పాటు జ‌రిగే ఈ సాంస్కృతిక ఉత్సవాల‌కు జిల్లా యంత్రాంగం, రాష్ట్ర పర్యాట‌క శాఖ భారీ ఏర్పాట్లు చేసింది. 

 

క‌డ‌ప‌ జిల్లా  జమ్మలమడుగు నియోజ‌క‌వ‌ర్గ కేంద్రానికి  15 కిలోమీటర్ల దూరంలోని గండికోటలో 900ఏళ్ల క్రితం నిర్మితమైన కట్టడాలు, పెన్నా నది సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఈ గండికోటకు చారిత్రకంగా ఎంతో చ‌రిత్ర ఉంది. ఇక్కడి ప్రకృతి ర‌మ‌నీయ దృశ్యాలు చూప‌రుల‌కు ఇట్టే క‌ట్టిప‌డేస్తుంటాయి. పూర్వీకులు అందించిన అద్భుత శిల్ప సంపద గండికోట సొంతం. శతాబ్దాలు గడిచినా చెక్కుచెదరని ఎన్నో చారిత్రక కట్టడాలు ఇక్కడున్నాయి. 

 

గండికోట వైభ‌వాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు, ఇక్కడి శిల్ప సంద‌న‌ను, ప్రకృతి ర‌మ‌ణీయ‌ల‌ను కాపాడేందుకు చ‌ర్యలు తీసుకోవాల‌న్న ప‌ర్యాట‌క ప్రియుల డిమాండ్‌తో గ‌త ప్రభుత్వ హ‌యాంలో గండికోట ఉత్సవాల‌కు 2015లో అంకురార్పణ జ‌రిగింది. అప్పటి నుంచి వ‌రుస‌గా గండికోట ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.  ఈ రోజు, రేపు ఉత్సవాల‌ను ఘనంగా నిర్వహిస్తున్నారు. అయితే గండికోట ఉత్సవాల స‌మ‌యంలో మిన‌హా మిగ‌తా రోజుల్లో ఈ ప్రాంతాన్ని పట్టించుకోవడం లేద‌న్న విమ‌ర్శలు ఉన్నాయి.

 

గండికోటలో చారిత్రక‌ విశేషాలున్న ఎన్నో కట్టడాలు  స‌రైన ఆదరణ లేక శిథిలావస్థకు చేరుకున్నాయి. యోగివేమన, కలియుగ కాలజ్ఞాని శ్రీపోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి కాలజ్ఞానంలో కూడా ఈ గండికోట  ప్రస్తావన వున్నట్లు పెద్దలు చెబుతున్నారు. అయితే గండికోట చారిత్రక సంపదలో అధికారులు గుర్తించని చాలా సంపద మౌనంగా చూస్తోంది. నాటి రాజరిక పాలనలో రాణులు నివసించిన గృహాలు, రాజ్య అధికారుల నివాసాలు, దుర్గంలోని ఆయుధసామాగ్రి, పలు శాసనాలు, దేవాలయాలు, దుర్గం సొరంగ మార్గాలతో పాటు పలు చరిత్ర ఆనవాళ్లు గుర్తింపు నోచుకోకుండా వుండిపోయాయి. అధికారులు వాటిని కూడా ఉత్సవాల్లో పర్యాటకులు సందర్శించేలా ఏర్పాటు చేస్తే గండికోట ప్రాశస్త్యం ప్రపంచవ్యాప్తంగా ఇనుమడించడానికి అవకాశం ఉంటుందని పర్యాటకులు చెబుతున్నారు. 

 

అదేవిధంగా పెన్నానది లోయ వెంబడి ప్రకృతి అందాలతో కూడిన ఎన్నో అపురూప దృశ్యాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో సినిమా షూటింగ్‌లు కూడా జరిగాయి. అలాగే మైలవరం జలాశయం మధ్యలో ఉన్న నెమళ్లతిప్ప ఓ ద్వీపకల్పంలా ఉండడం గండికోట పర్యాటకానికి అదనపు ఆకర్షణ.

మరింత సమాచారం తెలుసుకోండి: