దేశంలోని బ్యాంకులు ఖాతాదారులకు మేలు చేకూరేలా విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతున్నాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఒక బ్యాంక్ కస్టమర్ మరో బ్యాంకుకు వెళ్లి తన ఖాతాలో డబ్బులు జమ చేసుకునే విధంగా ప్రతిపాదనలను సిద్ధం చేసింది. అంతేకాకుండా వేరే బ్యాంక్ ఏటీఎం మనీ డిపాజిట్ మెషీన్లలో మన బ్యాంకు అకౌంట్ లోకి డబ్బులను జమ చేసుకోవచ్చు.
 
దేశంలోని వివిధ బ్యాంకులు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్.పీ.సీ.ఐ) ప్రతిపాదనలపై ఆలోచనలు చేస్తున్నాయి. ఎన్.పీ.సీ.ఐ చెల్లింపులకు సంబంధించిన బాధ్యతలను పర్యవేక్షించనుంది. ఎన్.పీ.సీ.ఐ క్యాష్ డిపాజిట్ ఇంటర్ ఆపరబిలిటీ సర్వీస్ ను ఉపయోగించుకుంటే బ్యాంకులకు మరియు ఖాతాదారులు చాలా ప్రయోజనాలు పొందవచ్చని చెబుతోంది. 
 
ఈ విధానాన్ని అమలులోకి తీసుకొనిరావటం ద్వారా నగదు నిర్వహణ ఖర్చులు తగ్గుతాయని ఎన్.పీ.సీ.ఐ పేర్కొంది. నేషనల్ ఫైనాన్షియల్ స్విఛ్ ఆపరేషన్స్ ద్వారా ఇది సాధ్యమని ఎన్.పీ.సీ.ఐ పేర్కొంది. దేశంలోని 14 బ్యాంకులు ఎన్.పీ.సీ.ఐ ప్రతిపాదనలకు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. యూనియన్ బ్యాంక్, ఆంధ్ర బ్యాంక్, ఇతర బ్యాంకులు ఈ ప్రతిపాదనలకు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. 
 
ఈ విధానాన్ని అమలులోకి తీసుకొనిరావటం వలన ఎటువంటి ఇబ్బందులు ఉండవని ఎన్.పీ.సీ.ఐ చెబుతోంది. ఒక బ్యాంకులో ఖాతా ఉన్న వ్యక్తి మరో బ్యాంకులో లేదా మరో బ్యాంకు ఏటీఎంలో నగదు జమ చేస్తే 10,000 రూపాయల లోపు జమ చేయటానికి 25 రూపాయలు, 10,000 రూపాయలకు పైగా జమ చేయటానికి 50 రూపాయలు సర్వీస్ చార్జీలు వసూలు చేయాలని ఎన్.పీ.సీ.ఐ. నిర్ణయించింది. బ్యాంకులు ఈ సర్వీసెస్ అందుబాటులోకి వస్తే ఏటీఎం సాఫ్ట్ వేర్ లను అప్ డేట్ చేయాలని కూడా ఆలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విధానం అందుబాటులోకి వస్తే బ్యాంకు ఖాతాలు ఉన్నవారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. త్వరలోనే ఈ విధానం అమలులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: