తెలుగుదేశం పార్టీతో దూరం అవ‌డం ప‌ట్ల జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మ‌ళ్లీ స్పందించారు. గ‌త కొద్దికాలంగా ఆ పార్టీతో క‌లిసి వివిధ కార్య‌క్ర‌మాలు చేపడుతున్న ప‌వ‌న్ అధికారికంగా పొత్తు లేక‌పోవ‌డంపై మ‌ళ్లీ క్లారిటీ ఇచ్చారు. మంగళగిరిలోని జ‌న‌సేన‌ పార్టీ కార్యాలయంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికలు, రాజధాని అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..  “సుదీర్ఘ లక్ష్యాలను అందుకోవాలంటే చాలా కష్టపడాలి. అందుకే పార్టీ స్థాపించినప్పటి నుంచి 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం అని చెబుతున్నాను.``అని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల బరిలో అనుభవం ఉన్నవారితోపాటు యువతరానికి పెద్ద పీట వేస్తామని తెలిపారు. ఏళ్ల తరబడి నిస్వార్ధంగా పార్టీ జెండా మోసిన యువతకు 50 శాతం టికెట్లు ఇచ్చి నిలబెడతామని అన్నారు.

 


ఈ సంద‌ర్భంగానే టీడీపీతో పొత్తు గురించి ప‌వ‌న్ స్పందించారు. ``ప్రజలకు మంచి పాలన అందాలనే ఉద్దేశంతో 2014లో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చాం.  కొన్ని కారణాలతో తెలుగుదేశం పార్టీని వ్యతిరేకించి 2019లో ఒంటరిగా పోటీ చేశాం. బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీ విడిపోయాయి కనుక వైసీపీ బలపడింది.`` అని పేర్కొన్నారు. 


 
స్థానిక సంస్థల ఎన్నికల గురించి స్పందిస్తూ, ``ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉంటాయి. కొంత మంది నాయకులు బెదిరింపులకు దిగుతుంటారు. ఇలాంటి బెదిరింపులకు కార్యకర్తలు భయపడాల్సిన అవసరం లేదు.  పార్టీ తరఫున హెల్ప్ లైన్ ఏర్పాటు చేయడంతో పాటు.. లీగల్ టీం అందుబాటులో ఉండే ఏర్పాటు చేస్తాం. అలాగే అభ్యర్ధులకు బీ ఫాం ఇవ్వడానికి ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని కూడా వేస్తాం.  అలాగే స్థానిక సంస్థల ఎన్నికలను పర్యవేక్షించడానికి  పార్టీ తరపున రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి ఎలక్షన్ కమిటీలను నియమిస్తాం`` అని అన్నారు. స్థానిక పోరులో కుల, వర్గ పోరాటాలతో పాటు దౌర్జన్యాలు ఉంటాయని, ఆ పరిస్థితులను ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలంటూ దిశానిర్దేశం చేశారు. తెగింపు లేకపోతే ముందుకు వెళ్లలేమన్న పవన్ కళ్యాణ్ ... కొత్తరక్తం రాకపోతే రాజకీయాల్లో మార్పు రాదని స్పష్టం చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: