న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తి గురించి జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. రాజధాని విషయంలో వైసీపీ ప్రభుత్వమే స్పష్టత ఇవ్వాల‌ని ప‌వ‌న్ డిమాండ్ చేశారు. మూడు రాజధానులు ఎలా సాధ్యమవుతుందో ప్రజలకు తెలియజేయాలని ఆయ‌న కోరారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలు, రాజధాని అంశాలపై చర్చ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఈ మేర‌కు ఆస‌క్తిక‌ర కామెంట్లు చేశారు. దీంతో పాటుగా, ఏపీ  సీఎం వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డికి, పొరుగు రాష్ట్రమైన త‌మిళనాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత‌కు మ‌ధ్య ఆస‌క్తిక‌ర పోలిక‌ను పెట్టారు.

 


``2015లో అమరావతి కోసం తెలుగుదేశం ప్రభుత్వం పెద్ద ఎత్తున భూ సమీకరణ చేపడితే అప్పుడే భయమేసి అడిగాను.. తర్వాత వచ్చిన పాలకులు దీనిని కొనసాగించకపోతే పరిస్థితి ఏంటని..? ఎందుకంటే ఇలాంటి రాజధాని వాస్తవ రూపం దాల్చాలంటే కనీసం రెండున్నర దశాబ్ధాలు పడుతుంది. ఆ రోజు నేను వ్యక్తం చేసిన భయమే ఇవాళ నిజమైంది. తమిళనాడులో కరుణానిధి అసెంబ్లీ నిర్మిస్తే దానిని జయలలిత ఆస్పత్రిగా మార్చేశారు. ఇప్పుడు ఏపీ సీఎం రాజ‌ధాని మార్చాల‌ని చూస్తున్నారు`` అని ప‌వ‌న్ అన్నారు.

 

 

పాలన ఒకే చోటు నుంచి జరగాలి... అభివృద్ధి అన్ని చోట్ల‌కు చేరాల‌ని రాజధాని విషయంలో జనసేన పార్టీ తరపున స్పష్టమైన నిర్ణయం తీసుకున్నామ‌ని ప‌వ‌న్ పేర్కొన్నారు. ``రాజధాని విషయంలో వైసీపీ ప్రభుత్వమే స్పష్టత ఇవ్వాలి. మూడు రాజధానులు ఎలా సాధ్యమవుతుందో ప్రజలకు తెలియజేయాలి. మూడు రాజధానుల ప్రకటన చేసి ముఖ్యమంత్రి విశాఖపట్నం వెళితే స్పందన ఎలా వచ్చిందో మనందరం చూశాం. అదే జనసేన పార్టీ ఇసుక సమస్యపై లాంగ్ మార్చ్ పెడితే ప్రజల నుంచి ఏ విధంగా స్పందన వచ్చిందో కూడా మనం చూశాం. ప్రజా సమస్యలపై నిలబడతాము కాబట్టే మనకు ఆ స్పందన వచ్చింది. కోట్లాది మంది ప్రజల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోంది. రాజధాని కోసం భూములు త్యాగం చేసిన రైతులకు అండగా జనసేన పార్టీ ఉంటుంది. వారికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తుంది” అని ప‌వ‌న్‌ హామీ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: