ఓ వైపు దారుణ ప‌రాజ‌యం, వ‌రుస‌గా నేత‌లు పార్టీ మారుతున్న ప‌రిస్థితులు మ‌రోవైపు అమ‌రావ‌తి నిర్మాణంలో పురోగ‌తి లేక‌పోవ‌డం, ప‌రిపాల‌న వికేంద్రీక‌ర‌ణ పేరుతో ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణ‌యాల‌తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న టీడీపీ అధ్య‌క్షుడు, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత నారా చంద్ర‌బాబు నాయుడుకు ఇంకో షాక్ త‌గిలింది. ఈ ద‌ఫా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ న‌మ్మిన‌బంటు, వైఎస్సార్సీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వి.విజయసాయి రెడ్డి రూపంలో ఆ షాక్ త‌గిలింది. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ నీడ అనే పేరున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ద్వారా ఈ హ‌ఠ‌త్ ప‌రిణామం బాబు ఎదుర్కోవాల్సి వ‌చ్చిందంటున్నారు.

 

 

 

హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేసే సీబీఐ జాయింట్‌ డైరెక్టర్ నియామకం తరచుగా  రాజకీయ దురుద్దేశాలతో, రాజకీయ స్వప్రయోజనాల సాధన కోసం జరుగుతోందని చెబుతూ.. గత ఏడాది డిసెంబర్‌ 30న విజయసాయి రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్‌ షా, సీబీఐ డైరెక్టర్‌కు లేఖలు రాశారు. ఈ నేపథ్యంలో తెలుగేతర అధికారిని జేడీగా నియమించాలని ఆయన కోరారు. తెలుగు అధికారిని జేడీగా నియమిస్తున్నందు వలన జరుగుతున్న అనర్ధాలను, అక్రమాలను ఆయన ఆ లేఖలో వివరించారు. తెలుగు అధికారులను జాయింట్‌ డైరెక్టర్లుగా నియమించడం వలన వారు స్థానిక రాజకీయ, సామాజిక పరిణామాలకు ప్రభావితులవుతున్నారు. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగువాడైన సీబీఐ జాయింట్‌ డెరెక్టర్‌ను ప్రలోభాలతో లోబరచుకుని వారిని తన రాజకీయ ప్రత్యర్ధులపైకి ఏ విధంగా ఉసిగొల్పుతారో గతంలో జరిగిన ఉదంతాలను విజయసాయిరెడ్డి ఆ లేఖలో వివరించారు. గడచిన అయిదేళ్ళ కాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పాల్పడిన వేల కోట్ల రూపాయల అక్రమాలు, అవినీతి కార్యకలాపాల నిగ్గు తేల్చాలంటే తెలుగేతర సీబీఐ జాయింట్‌ డైరెక్టర్‌గా తెలుగేతర అధికారి నియామకం జరిగితేనే సాధ్యపడుతుందని ఆయన వివరించారు. 

 

విజయసాయి రెడ్డి లేఖకు సమాధానంగా ఈనెల 10న హోం మంత్రి అమిత్‌ షా తిరిగి లేఖ రాశారు. విజయసాయి రెడ్డి లేఖలో ప్రస్తావించిన పలు అంశాలపై తగిన చర్యలు తీసుకోవలసిందిగా కోరుతూ ప్రధాన మంత్రి నేతృత్వంలో పనిచేసే సిబ్బంది, శిక్షణ మంత్రిత్వ శాఖకు ఆ లేఖను పంపినట్లు అమిత్ షా తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: