తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు భక్తి భావం ఎంత ఎక్కువో మనకి తెలిసిందే. సెంటిమెంట్లు అన్నా, యజ్ఞ యాగాలకు ఆయన ఎంతగానో ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు.  
అసలు ఆయన రెండోసారి తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టింది ఆ బలంతోనే అన్న నమ్మకంతోనే కేసీఆర్ ఇప్పటికీ ఉన్నారు. జాతకాలు, వాస్తుల ప్రకారం ఎప్పటికప్పుడు మార్పు చేర్పులు చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఆ సెంటిమెంట్ ను ఉపయోగించుకుని ఆయన ముఖ్యమంత్రి పీఠానికి ఎసరు తెచ్చేందుకు తెలంగాణ బీజేపీ నాయకుడు ఒకరు ప్రయత్నాలు మొదలుపెట్టేందుకు సిద్దమవుతున్నారట. ఇంతకీ ఆయన ఎవరో కాదు ఇటీవల బీజేపీలో చేరిన మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు. 


కేసీఆర్‌ను సీఎం సీటు నుంచి దింపేందుకు త్వరలో యాగం చేస్తాను అంటూ ఆయన ప్రకటించారు. కేసీఆర్ పతనం చూడటమే తన ఏకైక లక్ష్యం అంటూ మోత్కుపల్లి ప్రకటించారు. బీజేపీలో చేరిన తర్వాత తొలిసారి శనివారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన మోత్కుపల్లికి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా మాట్లాడిన మోత్కుపల్లి కేసీఆర్ కుటుంబంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.కేసీఆర్‌ను సీఎం సీటు నుంచి దించాలని లక్ష్మీనరసింహ స్వామిని మొక్కుకున్నాను అంటూ ఆయన ప్రకటించారు. రాష్ట్రానికి పట్టిన శని కేసీఆర్‌ను దించేయటానికి ప్రత్యేక యాగం చేస్తానన్నారు.


 సీఎం కేసీఆర్‌ను ఎనిమిదో నిజాంతో పోల్చిన మోత్కుపల్లి ఆయన హయాంలో తెలంగాణ ప్రజలకు బానిసలుగా బ్రతికే పరిస్థితి వచ్చిందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ దగ్గరకు ఆయన కొడుకు, బిడ్డ, అల్లుడికి తప్ప ఎవరికీ ప్రవేశం లేదని విమర్శించారు. తెలంగాణలో దళితుల అభివృద్ధే తనకు ముక్యమంటూ మోత్కుపల్లి ప్రకటించారు. కేసీఆర్ సీఎం అయ్యాక రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య బాగా పెరిగిపోయిందని మోత్కుపల్లి అన్నారు. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే కేసీఆర్ గద్దె దిగాల్సిందేనని మోత్కుపల్లి అన్నారు. అయితే నిజంగా ఆయన యాగం కనుక చేస్తే తెలంగాణాలో రాజకీయ సంచలనం రేగడం మాత్రం ఖాయమే అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: