తెలంగాణ‌లో బ‌ల‌ప‌డాల‌ని భావిస్తున్న బీజేపీకి ఊహించ‌ని షాక్ త‌గిలింది. పార్టీ ముఖ్య‌నేత సోద‌రుడు కాంగ్రెస్ పార్టీలో చేరింది. తెలంగాణ రాజ‌కీయాల్లో కీల‌క నేత‌లుగా పేరున్న వివేక్‌-వినోద్ బ్ర‌ద‌ర్స్‌లో పెద్ద‌వాడైన వినోద్ కాంగ్రెస్ కండువా క‌ప్పుకొన్నారు. తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ ఆర్సీ కుంతియా, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ సమక్షంలో ఆయన శనివారం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ``నా సోదరుడు వివేక్ బీజేపీలో చేరడం ఆయన వ్యక్తిగత విషయం. వివేక్ ఆలోచన వేరు, నా ఆలోచన వేరు. అందుకే నేను  కాంగ్రెస్ లో చేరాను’  అని పేర్కొన్నారు. రాజకీయంగా కలిసే నిర్ణయాలు తీసుకునే ‘బ్రదర్స్‌’ ఒక్కొక్కరు ఒక్కో పార్టీలో కొనసాగ‌డం సందేహం అనుకున్న త‌రుణంలో...ఈ జంపింగ్ ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

 

 

కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌లుగా గుర్తింపు పొందిన‌ వినోద్, వివేక్‌ బ్రదర్స్‌ తొలుత 2013 జూన్‌ 2న టీఆర్‌ఎస్‌లో చేరారు. తన తండ్రి వెంకటస్వామి  చిరకాల వాంఛ తెలంగాణ రాష్ట్రం కేసీఆర్‌ ద్వారానే సాధ్యమని భావించి పార్టీలో చేరినట్లు అప్పట్లో ప్రకటించారు. తెలంగాణ బిల్లు ఆమోదించిన తరువాత 2014 ఏప్రిల్‌ ఎన్నికలకు 15 రోజుల ముందు మార్చి 31న బ్రదర్స్‌ ఇద్దరూ తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్‌ నుంచి పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా వివేక్, చెన్నూరు అసెంబ్లీకి వినోద్‌ పోటీచేసి ఓడిపోయారు. తెలంగాణలో రాజకీయ పునరేకీకరణ పేరుతో టీఆర్‌ఎస్‌ చేపట్టిన ఆపరేషన్‌లో 2016లో మరోసారి వీరిద్దరు టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. అయితే, ముంద‌స్తు ఎన్నిక‌లకు వెళ్లిన తెలంగాణ సీఎం కేసీఆర్ సెప్టెంబర్ 6, 2012న ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో చెన్నూరు నుంచి బాల్క సుమన్‌కు అవకాశం దక్కింది. వివేక్‌ కోసమే ఎంపీగా ఉన్న సుమన్‌ను చెన్నూరు సీటుకు ఎంపిక చేయ‌గా, మాజీ మంత్రినైన తనకు అవకాశం కల్పించకపోవడాన్ని వినోద్‌ సీరియస్‌గా తీసుకున్నారు. ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన‌ప్ప‌టికీ ఓట‌మి పాల‌య్యారు.

 


అప్ప‌టి నుంచి వినోద్ రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నారు. తాజాగా ఆయ‌న తిరిగి సొంత గూటికి చేరారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, కొన్ని కారణాల వలన తాను ఇండిపెండెట్‌గా పోటీ చేశానని పేర్కొన్నారు. ``కాంగ్రెస్ మా సొంత పార్టీ. మా నాన్న వెంకటస్వామి  ప్రోత్సహంతో రాజకీయాల్లోకి వచ్చాను. 35 ఏళ్ల నుంచి నాకు కాంగ్రెస్ పార్టీతో అనుబంధం ఉన్న‌ప్ప‌టికీ, గతంలో కొన్ని పొరపాట్ల వలన పార్టీ మారాల్సి వచ్చింది. గతంలో కాంగ్రెస్‌ పార్టీని వీడడం అపరిపక్వ నిర్ణయం. తిరిగి సొంతగూటికి చేరడం సంతోషంగా ఉంది. ఇది నా అదృష్ఠంగా భావిస్తున్నాను`` అని వెల్ల‌డించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: