జగన్మోహన్ రెడ్డి పెట్టిన మూడు రాజధానుల చిచ్చు రాష్ట్ర బిజెపిని నిలువునా చీల్చేసిందా ?  క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే అందరిలోను ఇదే అనుమానం వస్తోంది.  బిజెపి కీలక నేతల సమావేశం శనివారం విజయవాడలో జరిగింది. ఈ సందర్భంగా  సమావేశంలో  అమరావతినే రాజధానిగా కంటిన్యు చేయాలని కొందరు నేతలు డిమాండ్ చేశారు. అయితే మరి కొందరు నేతలు మాత్రం రాష్ట్రప్రభుత్వ నిర్ణయంతో కేంద్రానికి సంబంధం లేదని తేల్చేశారు.

 

జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానుల ప్రకటనపై బిజెపిలో మొదటి నుండి భిన్న స్వరాలు వినబడుతున్నాయి. కేంద్ర మాజీమంత్రి సుజనా చౌదరి, టిడిపిలో నుండి బిజెపిలోకి ఫిరాయించిన రాజ్యసభ ఎంపి సుజనా చౌదరికి జగన్ ప్రతిపాదనను పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. సరే ఈయన వ్యతిరేకతంతా చంద్రబాబునాయుడుకు మద్దతుగానే ఉంటుంది లేండి.

 

రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు ముందు జగన్ ప్రకటనను స్వాగతించారు. తర్వాత తెరవెనుక ఏమైందో ఏమో వెంటనే సుజనాకు కన్నా తో పాటు మరికొందరు నేతలు వత్తాసు పలికారు. అదే సమయంలో  జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ ఎంపి జీవిఎల్ నరసింహారావు, ఎంఎల్సీ సోము వీర్రాజు లాంటి కొందరు నేతలు మాత్రం రాజధానుల విషయంలో కేంద్రానికి ఎటువంటి సంబంధం లేదని చెబుతునే ఉన్నారు.

 

సరే ఇదే పద్దతిలో గడచిన 25 రోజులుగా బిజెపిలోని రెండు వర్గాలు చెరో రకంగా మాట్లాడుతునే ఉన్నాయి. ఈ నేపధ్యంలోనే విజయవాడలో జరిగిన కోర్ కమిటి సమావేశంలో  మళ్ళీ రెండు వర్గాలు ఎవరి వాదనకు వాళ్ళు కట్టుబడున్నారు. జగన్ ప్రతిపాదనను కేంద్రానికి పంపాలని కన్నా లాంటి వాళ్ళు పట్టుబడ్డారు. అయితే జీవిఎల్, సోము వీర్రాజు మళ్ళీ వ్యతిరేకించారు. దాంతో కోర్ కమిటి తాజా సమావేశంలో  తీరు చూసిన తర్వాత పార్టీ నేతలు రెండుగా చీలిపోయినట్లే అనిపిస్తోంది.  మొత్తానికి జగన్ పెట్టిన చిచ్చు  బిజెపిని రెండుగా చీల్చేసిందనే అనుమానం పెరిగిపోతోంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: