పార్టీ నుంచి గెలిచింది ఒక్కడే అయినా అధినేతకు నిత్యం చుక్కలు చూపిస్తూ మీ లెక్క ఏంటి అన్నట్టుగా వ్యవహరిస్తూ అధికార పార్టీకి దగ్గరగా, సొంత పార్టీకి దూరంగా ఉంటూ రాజోలు జనసేన ఎమ్యెల్యే రాపాక వరప్రసాద్ చేస్తున్న రాజకీయం ఆ పార్టీ నేతలకు, అధ్యక్షుడు పవన్ కు మింగుడు పడడంలేదు. ఆయన ఎమ్యెల్యేగా గెలించిన దగ్గర నుంచి జనసేన తో కంటే వైసీపీతోనే ఎక్కువ సన్నిహితంగా ఉంటూ సరికొత్త రాజకీయానికి తెర తీసాడు. జగన్ ఫోటోలకు పాలాభిషేకాలు చేస్తూ ఆ పార్టీలో చేరకుండానే వైసీపీ ఎమ్యెల్యేగా చెలామణి అయిపోతున్నాడు. ఈ రోజు జనసేన విస్తృత స్థాయి సమావేశం జరుగుతున్నా రాపాక పట్టించుకోకుండా ఆ సమావేశానికి డుమ్మా కొట్టారు. పోనీ ఏదయినా ముఖ్యమైన కార్యక్రమంలో ఉన్నారా అంటే అదీ లేదు. 


తూర్పుగోదావరి జిల్లాలో ఓ చోట జరుగుతున్న కోడి పందేలు చూడటానికి వెళ్లారు. అక్కడ మంత్రి కొడాలి నాని వస్తే ఆయనతో కలిసి పందాలను బాగా ఎంజాయ్ చేశారు. జనసేన విస్తృత స్థాయి సమావేశానికి ఏకైక ఎమ్మెల్యేగా ఆయనకు ఆహ్వానం లభించింది. కానీ రాపాక జనసేనతో ఉండటం కంటే వైసీపీతో ఉంటేనే తనకు రాజకీయ భవిష్యత్ ఉంటుంది అన్న కోణంలో డుమ్మా కొట్టినట్టు అర్ధం అవుతోంది. రాపాక పార్టీకి ఎంత దూరంగా ఉంటున్నా పవన్ మాత్రం ఆయనకు బాగానే ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. 


ఇటీవల నియోజకవర్గాల ఇంచార్జిలను ప్రకటించిన పవన్ రాజోలు కి రాపాకను ఇంచార్జీగా ప్రకటించారు. ఆయన మాత్రం జనసేన విషయంలో దూరమే పాటిస్తున్నారు. రాపాక వరప్రసాద్ అధికారికంగా వైసీపీలో చేరితే అనర్హత వేటు పడుతుంది. అయితే ఒక్కరే ఎమ్మెల్యే కాబట్టి వైసీపీలో చేరినా చేరకపోయినా వచ్చే నష్టం ఏమీ ఉండదు. అందుకే జగన్ తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని సమర్ధిస్తూ తాను వైసీపీ నాయకుడినే అన్నట్టుగా ఆయన వ్యవహరిస్తున్నారు. దీనిపై జనసైనికుల నుంచి తీవ్ర వ్యక్తం అవుతున్నాయి. తమ పార్టీ, అధ్యక్షుడు అవసరం లేనప్పుడు తమ పార్టీ ద్వారా గెలిచిన సీటుకి రాజీనామా చేయాలి కదా అంటూ మండిపడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: