రాజధానిని అమరావతి నుంచి  విశాఖపట్నం తరలించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తూ,  ఆందోనళనలను కొనసాగిస్తున్నరైతులనుద్దేశించి  ఎస్వీబీసీ చైర్మన్, సినీనటుడు పృథ్వీ చేసిన వ్యాఖ్యల పట్ల ,  వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది . రాజధాని తరలింపు నిర్ణయం తో ,  రైతులు ఎక్కడ  పార్టీకి దూరం అవుతారేమోనన్న ఆందోళనలో ఉన్న పార్టీ నాయకత్వానికి  , పృథ్వీ వ్యాఖ్యలు షాక్ కు గురి చేశాయి . రైతుల గురించి మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాల్సిందిపోయి, నోటికొచ్చినట్లు మాట్లాడిన పృథ్వీ తీరుపై పార్టీ నాయకత్వం సీరియస్ గా ఉండడమే కాకుండా ఆయన నుంచి వివరణ కోరే   అవకాశాలు లేకపోలేదన్న వాదనలు విన్పిస్తున్నాయి .

 

రాజధాని ప్రాంతం లో ఆందోళన చేసేవాళ్లంతా పెయిడ్ ఆర్టిస్టులేనన్న పృథ్వీ , అంతటితో ఆగకుండా రైతులంటే మోకాలిలోతు బురదలోకి దిగి , కాళ్ళు కడుక్కుని ...ఎదో తిని ఉండేవాళ్ళని అన్నారు .  ఖద్దరు బట్టలు వేసుకుని , మేడలో నాలుగైదు గొలుసులు వేసుకున్న  రైతులను  అమరావతి ప్రాంతం లో మాత్రమే చూస్తున్నానని ఎద్దేవా చేశారు . ఇదంతా కార్పొరేట్ ముసుగులో సాగుతున్న ఉద్యమమని పృథ్వీ విమర్శించారు . పృథ్వీ వ్యాఖ్యలను తోటినటుడు , వైస్సార్ కాంగ్రెస్ పార్టీ కి చెందిన నాయకుడు పోసాని కృష్ణమురళి తీవ్రంగా ఖండించారు . తక్షణమే రైతులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు . అయినా పృథ్వీ మాత్రం తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని చెప్పి , కొరివితో తలగోక్కుంటున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి .

 

పృథ్వీ వ్యాఖ్యలను విపక్షాలు ఖండించే దానికంటే ముందుగానే సొంతపార్టీకే చెందిన  మరొక సినీనటుడు పోసాని బాహాటంగా తప్పు పట్టడం కూడా వైస్సార్ కాంగ్రెస్ నాయకత్వాన్ని ఇబ్బందుల్లోకి నెట్టినట్లయింది. ఇప్పుడు ఇదే అంశాన్ని విపక్షాలు ఎత్తి చూపుతూ , రైతులంటే వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు ఎంత చులకనో ఇట్టే అర్ధం అవుతుందని పేర్కొంటూ , ఆ పార్టీ నాయకత్వాన్ని ఇబ్బందుల్లోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: