తృణ‌మూల్ కాంగ్రెస్‌ పార్టీ అధినేత‌, ప‌శ్చిమ‌బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తాబెన‌ర్జీ ఫైర్‌బ్రాండ్ రాజ‌కీయ నాయ‌కురాలిగా పేరు పొందిన సంగ‌తి తెలిసిందే. గ‌త కొంత‌కాలంగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది ఈ లేడీ లీడ‌ర్‌. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ పౌరపట్టిక(ఎన్‌ఆర్సీ), జాతీయ జనాభా జాబితా(ఎన్‌పీఆర్‌)ల విష‌యంలో మ‌మ‌త దూకుడుగా ముందుకు సాగుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే, తాజాగా ఆమె ఊహించ‌ని ట్విస్ట్ ఇచ్చారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం పశ్చిమ బెంగాల్‌ చేరుకున్న ప్రధాని నరేంద్రమోదీతో పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజ్‌భవన్‌ వేదికగా భేటీ అయ్యారు. అయితే, ఇది మ‌ర్యాద‌పూర్వ‌క స‌మావేశం కాదు. త‌న అభ్యంత‌రాలు పేర్కొనేందుకు వేదిక‌గా చేసుకున్నారు. 

 

రెండు రోజుల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఈరోజు సాయంత్రం ప్ర‌ధాని కోల్‌క‌తా చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులో మోదీకి స్వాగతం పలికేందుకు ముఖ్యమంత్రి హోదాలో మమతా బెనర్జీ రాలేదు. గవర్నర్‌ ధన్‌కర్‌, కోల్‌కతా మేయర్‌, మంత్రి ఫర్హద్‌ హకీం, ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. అనంత‌రం, ప్రధాని నరేంద్రమోదీతో పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజ్‌భవన్‌ వేదికగా భేటీ అయ్యారు. ఈ స‌మావేశం త‌ర్వాత మీడియాతో మాట్లాడుతూ, పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ పౌరపట్టిక(ఎన్‌ఆర్సీ), జాతీయ జనాభా జాబితా(ఎన్‌పీఆర్‌)లకు తాము వ్యతిరేకమని మోదీతో సమావేశంలో తాను స్పష్టం చేసినట్లు మమతా తెలిపారు. తక్షణమే సీఏఏ, ఎన్‌పీఆర్‌, ఎన్‌ఆర్సీలను ఉపసంహరించుకోవాలని కోరినట్లు దీదీ చెప్పారు. బెంగాల్‌ ప్రజలు ఎన్‌ఆర్సీ, సీఏఏలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించరని మోదీకి వివరించాను. వీటిని పునఃసమీక్షించాలని కోరాను. ఐతే తాను పలు కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఇక్కడికి వచ్చానని.. ఢిల్లీలో మరోసారి భేటీకావాలని మోదీ నన్ను ఆహ్వానించారని మమతా పేర్కొన్నారు.

 

కాగా,   మోదీ రాక నేపథ్యంలో సిటీలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు నిరసన ర్యాలీలు నిర్వహించాయి. ఆందోళనలో అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ అనుబంధ విద్యార్థి విభాగం, వామపక్షాల కార్యకర్తలు వేర్వేరుగా ఆందోళనలో పాల్గొన్నారు. సీఏఏకు వ్యతిరేకంగా బెంగాల్‌లో నిరసనలు జరుగుతున్నప్పటికీ వీరిద్దరి భేటీ జరగడం గమనార్హం. అదే స‌మ‌యంలో కోల్‌క‌తాలోనూ మోదీకి వ్య‌తిరేకంగా మ‌మ‌త గ‌లం వినిపించ‌డం ఆస‌క్తిక‌రం.

మరింత సమాచారం తెలుసుకోండి: