అమరావతిని  రాజధాని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం అనంతపురం లో పర్యటించనున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు నిరసన సెగ తప్పదా ? అంటే రాయలసీమ యునైటెడ్ ఫోర్స్ , రాయలసీమ విద్యార్థి పోరాట సమితి , రాయలసీమ విద్యార్థి సమాఖ్యలు శనివారం  విడుదల చేసిన కరపత్రాన్ని పరిశీలిస్తే అవుననే సమాధానము విన్పిస్తోంది . రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు రాజధానుల ఏర్పాటును వ్యతిరేకిస్తూ , చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో  పర్యటిస్తున్న విషయం తెల్సిందే .

 

అమరావతిని రాజధానిగా ఎప్పటికీ ఒప్పుకొని , రాయలసీమ ప్రాంతంలో చంద్రబాబు యాత్రలు చేయడం అనైతికమని ఈ మూడు సంఘాలు తాము  విడుదల చేసిన కరపత్రం లో మండిపడుతున్నాయి .  రాయలసీమ కు అక్కర్లేని అమరావతిని ...  రాజధానిగా కొనసాగించాలని కరువు ప్రాంతమైన అనంత లో చంద్రబాబు యాత్రలు నిర్వహించడం పట్ల రాయలసీమ యునైటెడ్ ఫోర్స్ , విద్యార్థి సమితి , సమాఖ్యలు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నాయి .   శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాయలసీమ లో రాజధాని ఏర్పాటు చేయాల్సి ఉండగా , చంద్రబాబు నాయుడు ఏకపక్షంగా అమరావతిలో రాజధానిని ఏర్పాటు చేశారని మండిపడుతున్నారు . హైకోర్టును కూడా అమరావతిలో ఏర్పాటు చేసి , శ్రీబాగ్ ఒప్పందానికి తూట్లు పొడిచారని యునైటెడ్ ఫోర్స్ , విద్యార్థి సమితి , విద్యార్థి సమాఖ్య విరుచుకుపడుతున్నాయి .

 

అనంతపురం లో ఏర్పాటు చేయాల్సిన ఎయిమ్స్ ను మంగళగిరికి తరలించారని , తిరుపతిలో ఏర్పాటు చేయాల్సిన క్యాన్సర్ ఆసుపత్రిని కూడా అమరావతికి తరలించి సీమ కు చంద్రబాబు తీరని ద్రోహం చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి  . అనంతలో చంద్రబాబు యాత్రను అడ్డుకునేందుకు ఈ మూడు సంఘాల ప్రతినిధులు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది . అయితే ఈ సంఘాల ప్రతినిధులు చెబుతున్నట్లు, సీమ ప్రజలు కూడా చంద్రబాబు విధానాలపై అంతే ఆగ్రహంగా ఉన్నారా? లేదా ?? అన్నది మాత్రం ప్రశ్నార్ధకమే . 

మరింత సమాచారం తెలుసుకోండి: