అమరావతి ప్రాంత రైతుల గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎస్వీబీసీ చైర్మన్ , సినీనటుడు పృథ్వీ ఎట్టకేలకు దిగివచ్చారు . తాను రైతుల గురించి ఎప్పుడు తప్పుగా మాట్లాడలేదని చెప్పుకొచ్చారు . రైతు ముసుగులో ఉన్న వారి గురించి మాత్రమే మాట్లాడానన్న ఆయన ,  తమ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు . ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి , దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి లు రైతు పక్షపాతి అన్న విషయం తెల్సిందేనని పేర్కొన్నారు . ఇక తాను కడుపు అన్నమే తింటున్నానని గడ్డి తినడం లేదని , రైతులను ఎందుకు కించపరుస్తానని  పృథ్వీ ఎదురు ప్రశ్నించారు .

 

రాజధానిగా  అమరావతిని కొనసాగించాలంటూ , రాజధాని ప్రాంత రైతులు గత కొన్నిరోజులుగా ఆందోళన చేస్తున్న విషయం తెల్సిందే . అయితే రాజధాని ప్రాంతం లో ఆందోళన చేస్తున్న వారిని ఉద్దేశించి    పృథ్వీ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి . రైతులంటే మోకాలిలోతు బురదలోకి దిగి , కాళ్ళు కడుక్కుని , ఉన్నది తినేవారని అన్నారు .  కానీ ఖద్దరు చొక్కాలు ధరించి , మెడలో మూడు, నాలుగు చైన్లు ధరించిన రైతులను రాజధాని ప్రాంతం లోనే చూస్తున్నానని పృథ్వీ  అపహాస్యం చేశారు . రాజధాని కోసం ఆందోళనలు చేస్తున్నవారంతా పెయిడ్ ఆర్టిస్టులని, కార్పొరేట్ ముసుగులో ఈ ఉద్యమం కొనసాగుతుందని ఆరోపించారు . రైతులపై పృథ్వీ చేసిన వ్యాఖ్యలు అధికార వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని ఆత్మరక్షణలోకి నెట్టాయి .

 

ఇదే అదనుగా విపక్షాలు,  అధికార పార్టీ నేతల తీరును ప్రస్తావిస్తూ విమర్శలను గుప్పించడం ప్రారంభించాయి . రైతులకు క్షమాపణలు చెప్పాలని  తన తోటినటుడు పోసాని కృష్ణమురళి చేసిన సూచనను కూడా పృథ్వీ తోసిపుచ్చుతూ , తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని ప్రకటించిన కొన్ని గంటల వ్యవధిలోనే తన వైఖరిని మార్చుకుని ...  రైతులకు చేతులెత్తి నమస్కారం చేసి , తాను రైతుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయలేదని వివరణ ఇచ్చుకున్నారు .  

మరింత సమాచారం తెలుసుకోండి: