దారుణ హ‌త్య ఉదంతంలో సంచ‌ల‌న విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. షాహిద్ అనే యువ‌కుడు దారుణంగా గొంతు కోసి చంపిన ఘ‌ట‌న‌లో విస్మ‌య‌క‌ర నిజాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. వరంగల్‌లో యువతి హత్యకేసు నిందితుడు షాహిద్ స్వ‌యంగా ఈ వివ‌రాలు వెల్లడించినట్టు పోలీసులు తెలిపారు. వ‌రంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ విశ్వనాథ రవీందర్‌ మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం తన ప్రియురాలు వేరే యువకుడితో మాట్లాడటాన్ని జీర్ణించుకోలేకే చంపేశాడ‌ట‌. 

 


హన్మకొండ లష్కర్‌సింగారానికి చెందిన యువతికి 2016లో డిగ్రీ చదువుతున్న సమయంలో కాజీపేటకు చెందిన షాహిద్‌తో పరిచయం ఏర్పడింది. కొంతకాలం తర్వాత వీరి మధ్య స్నేహం పెరిగి ప్రేమగా మారింది. కొద్దిరోజుల క్రితం యువతికి వరంగల్‌లోని శివనగర్‌కు చెందిన సుకుమార్‌తో పరిచయం ఏర్పడటంతో షాహిద్‌ గమనించి ఆమెను పలుమార్లు ప్రశ్నించాడు. ‘నిన్ను తప్ప మరెవరినీ ప్రేమించడం లేదని’ ఆ యువతి తెలిపింది. ఈక్రమంలో ఆమె రెండు రోజులక్రితం సుకుమార్‌తో ఫోన్‌లో మాట్లాడటం చూసిన షాహిద్‌ ఆగ్రహించాడు. శుక్రవారం మధ్యాహ్నం ఆమెకు ఫోన్‌చేసి హన్మకొండ మూడుచింతల ప్రాంతానికి రమ్మన్నాడు. అక్కడి నుంచి ఆమెను బైక్‌పై తీసుకెళ్లి రాంనగర్‌లో తన సోదరుడు ఉండే అద్దె ఇంటి కి తీసుకెళ్లాడు. కొంతసేపు బాగానే ఉన్న అనంతరం సుకుమార్‌ విషయాన్ని ప్రస్తావించాడు.

 


ఈ క్రమంలో యువతి, షాహిద్‌ గొడువపడ్డారు. తాను సుకుమార్‌ను వివాహం చేసుకుంటానని ఆమె చెప్పడంతో ఆగ్రహించిన షాహిద్‌ ఆమెను అదిమిపట్టి కీచైన్‌కు ఉన్న కత్తితో గొంతు కోశాడు. తీవ్ర రక్తస్రావంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం షాహిద్‌ కాజీపేటలోని తన ఇంటికి వెళ్లి దుస్తులు మార్చుకొని వరంగల్‌లోని సెంట్రల్‌ జైలుకు వెళ్లాడు. అక్కడి సిబ్బంది సుబేదారి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాలని సూచించారు. దీంతో షాహిద్‌ సుబేదారి పోలీస్‌స్టేషన్‌కు వచ్చి లొంగిపోయాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. అతడి నుంచి బైక్‌, రక్తపు మరకలతో ఉన్న దుస్తులు, కీచైన్‌ కత్తి స్వాధీనం చేసుకున్నట్టు సీపీ విశ్వనాథ రవీందర్‌ వెల్లడించారు. షాహిద్‌పై 302, 376, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చగా రిమాండ్‌ విధించారని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: