భార‌త‌ సైన్యాధిపతి జనరల్ ఎంఎం నరవణె కీలక వ్యాఖ్యలు చేశారు.  ఆర్మీ డే నేపథ్యంలో ఆయన ఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పాక్‌కు షాక్ ఇచ్చారు. జమ్ముకశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్‌లో ఇద్దరు పౌరులను పాక్ సైన్యం హతమార్చడంపై ఆయన స్పందించారు. భారత్ ఇలాంటి అనాగరిక చర్యలకు దిగబోదని, సైనిక పద్ధతిలోనే వారికి బదులిస్తామని స్పష్టంచేశారు. జమ్ములో సైన్యంపై వస్తున్న ఆరోపణలపై ప్రశ్నించగా.. వాటిపై విచారణ పూర్తయిందని, ఆరోపణలన్నీ అవాస్తవాలని తేలిందని చెప్పారు.

 

 

రాజకీయ అధినాయకత్వం కోరుకుంటే పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)ను స్వాధీనం చేసుకునేందుకు తాము సిద్ధమేనని సైన్యాధిపతి జనరల్ ఎంఎం నరవణె చెప్పారు. తద్వారా పాక్‌కు గట్టి సందేశం పంపారు. పీవోకేను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి సైన్యం సిద్ధంగా ఉన్నదా అని విలేకరులు ప్రశ్నించగా ఆయన ఈ మేరకు స్పందించారు. ``పీవోకేకు సంబంధించినంత వరకు.. జమ్ముకశ్మీర్ యావత్తూ భారత్‌లో అంతర్భాగమేనంటూ చాలా ఏళ్ల‌ కిందట పార్లమెంట్‌లో తీర్మానాన్ని ఆమోదించారు. పార్లమెంట్ కోరుకుంటే ఆ ప్రాంతం తప్పక మనదవుతుంది. దీనిపై మాకు ఆదేశాలు అందితే.. తప్పకుండా మేం చర్యలు చేపడుతాం`` అని నవరణె వ్యాఖ్యానించారు. 

 

ఇక మ‌రో దేశ‌మైన చైనాకు సైతం ఇదే క్లారిటీ ఇచ్చారు. చైనాతో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు ఆ దేశ సరిహద్దుల్లో సైనిక సన్నద్ధతను సరిచేస్తున్నామని నరవణె చెప్పారు. ఈ మేరకు అధునాతన ఆయుధ సామగ్రిని తరలిస్తున్నామని, మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నామని తెలిపారు. ఆర్మీ అధిపతిగా జనరల్ బిపిన్ రావత్ స్థానంలో గతేడాది డిసెంబర్ 31న నరవణె బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఐటీపీక్యూ (ఇంటిగ్రేషన్-ఏకీకరణం, పర్సనల్ ట్రైనింగ్-సిబ్బంది శిక్షణ, క్వాలిటీ- నాణ్యత)పైనా తాను దృష్టిసారించనున్నట్లు నవరణే తెలిపారు. రక్షణ దళాల అధిపతి (సీడీఎస్), మిలిటరీ వ్యవహారాల విభాగం ఏర్పాటు.. ఏకీకరణ దిశగా తీసుకున్న అతిపెద్ద నిర్ణయమని చెప్పారు. ఇది విజయవంతం అయ్యేందుకు తమ వంతు కృషిచేస్తామని పేర్కొన్నారు. భవిష్యత్ యుద్ధాలకు అనుగుణంగా సిబ్బందికి శిక్షణ అందిస్తామన్నారు. ఆర్మీకి సిబ్బందే బలమని చెప్పారు. సిబ్బంది ఎంపికలో గానీ, ఆయుధ సామగ్రి ఎంపికలో గానీ, పరిమాణం కంటే నాణ్యతకే ప్రాధాన్యమిస్తామని తెలిపారు. సైన్యాధిపతిగా తన దృష్టి ఏబీసీ (అలీజియన్స్-విధేయత,బిలీఫ్-విశ్వాసం, కన్సాలిడేషన్-ఏకీకరణ)పైనేనని చెప్పారు. భారత రాజ్యాంగం పట్ల విధేయత కలిగి ఉంటామని మేం ప్రమాణం చేశాం. అది అధికారులు కానీ, జవాన్లు కానీ.. రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని మేం ప్రతిజ్ఞ చేశాం. అదే మమ్మల్ని నడిపిస్తున్నది అని ఆయన పేర్కొన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: