పోలవరం ప్రాజెక్టు.. ఆంధ్రుల ఆశాకిరణంగా చెప్పొచ్చు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఏపీలో నీటి కష్టాలకు చాలా వరకూ చెక్ చెప్పొచ్చు. అందుకే రాష్ట్ర విభజన సమయంలో ఈ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి నూటికి నూరు శాతం కేంద్ర నిధులతో నిర్మించేలా అంగీకరించారు. అయితే ఆశించిన స్థాయిలో నిధులు కేంద్రం నుంచి అందడం లేదు. ప్రాజెక్టు పనులు మందిగించే పరిస్థితి ఉంది.

 

అందుకే జగన్ సర్కారు ఇప్పుడు ఓ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. పోలవరం ప్రాజెక్టు పనులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా నిధులు సమకూర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం రెడీ అవుతోంది. పోలవరం ప్రాజెక్టుకు నెలకు సగటున రూ.1,100 కోట్ల మేర ఖర్చు చేయాలి. బడ్జెట్‌ పరిమితుల దృష్ట్యా ఆ స్థాయిలో నిధులు సమకూర్చడం కొంత కష్టతరమవుతుంది.

 

అందుకే సహాయ పునరావాస ప్యాకేజీ కింద నిర్వాసితులకు రాష్ట్ర ఖజానా నుంచి చెల్లింపులు చేసి, కాంట్రాక్టర్లకు ‘బిల్‌ డిస్కౌంట్‌’ విధానంలో బిల్లులు చెల్లించడం ద్వారా నిధుల కొరత ఎదురుకాకుండా చూసేందుకు జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ కసరత్తు చేస్తున్నారు. ఈ విధానంలో.. కాంట్రాక్టర్లు బ్యాంకు గ్యారంటీ, ఎర్నెస్ట్‌ మనీ డిపాజిట్‌, పెర్‌ఫార్మెన్స్‌ గ్యారంటీ , రిటెన్షన్‌ అమౌంట్‌ రూపంలో బ్యాంకు ద్వారా ప్రభుత్వానికి గ్యారంటీలను సమర్పిస్తారు.

 

హెడ్‌ వర్క్స్‌.. ఎడమ కాలువ, కుడి కాలువ, కనెక్టివిటీల పనులతోపాటు నిర్వాసితుల పునరావాస కాలనీల పనులు చేస్తున్న కాంట్రాక్టర్లకు ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించాలని జగన్ సర్కారు నిర్ణయించింది. 2021 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలన్న టార్గెట్ ను సీరియస్ గా తీసుకుంది. జగన్‌ దీన్ని అత్యంత ప్రాధాన్యత ప్రాజెక్టుగా పరిగణిస్తున్నారు. ప్రాజెక్టు ఫలాలను 2021 నాటికి రైతులకు అందించాల్సిందేనని జనవరి 7న నిర్వహించిన సమీక్షలో జలవనరుల శాఖ అధికారులకు దిశానిర్దేశం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: