2019 ఎన్నికల ఫలితాల తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ 151 ఎమ్మెల్యే సీట్లు సాధించగా టీడీపీ పార్టీ 23 స్థానాల్లో జనసేన పార్టీ ఒక స్థానంలో విజయం సాధించింది. ఎన్నికల ఫలితాల తరువాత ఏపీలో కొందరు తెలుగుదేశం పార్టీ నేతలు వైసీపీలో చేరాలని చూస్తున్నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పార్టీలోకి వస్తే మాత్రమే పార్టీలో చేర్చుకుంటామని సీఎం జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. పార్టీలో ఎమ్మెల్యేలను చేర్చుకోవడం గురించి డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పార్టీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకోవాలని నిర్ణయం తీసుకుంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అందరూ వైసీపీలోకే చేరతారని నారాయణ స్వామి అన్నారు. నిన్న తిరుపతిలో మాట్లాడిన నారాయణ స్వామి ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా వైసీపీ పార్టీలోకి వచ్చేస్తారని జోస్యం చెప్పారు. బాలకృష్ణ మీద ఉన్న కేసును రీ ఓపెన్ చేయిస్తామంటే బాలకృష్ణ వైసీపీలో చేరతారని అన్నారు. 
 
వైయస్ రాజశేఖర్ రెడ్డి సహాయంతోనే బాలకృష్ణ ఇంట్లో జరిగిన కాల్పుల కేసు గురించి బయటపడ్డారని నారాయణస్వామి ఈ సందర్భంగా గుర్తు చేశారు. విలేకరులు టీడీపీ పార్టీ ఎమ్మెల్యేలను బెదిరించి వైసీపీలో చేర్చుకుంటారా...? అని ప్రశ్నిస్తే మాత్రం నారాయణ స్వామి ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. ఆ తరువాత నారాయణ స్వామి మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో రాయలసీమకు చేసింది శూన్యం అని నారాయణస్వామి విమర్శలు చేశారు. 
 
చంద్రబాబు నాయుడు స్వలాభం కోసమే అమరావతి పేరు చెప్పుకొని రాధ్ధాంతం చేస్తున్నారని నారాయణ స్వామి ఆరోపణలు చేశారు. రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ అన్నారు. మరి డిప్యూటీ సీఎం చేసిన సంచలన వ్యాఖ్యలపై బాలకృష్ణ, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: