ఈ నెలాఖరులోగా రాజధాని విభజనపై ఏపీ ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసే సూచనలు కనిపిస్తున్నాయి. వీలైనంత త్వరలోనే హైపవర్ కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది. ఈ క్రమంలో 18వ తేదీన కెబినెట్.. ఆ తర్వాత రెండు రోజులకు అసెంబ్లీ సమావేశం పెట్టి ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసే ఛాన్స్ కన్పిస్తోంది.

 

రాజధాని విభజనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చకచకా పావులు కదుపుతోంది. ఇప్పటికే రెండు నివేదికలు తెప్పించుకున్న ప్రభుత్వం హైపవర్ కమిటీ నివేదికను కూడా వీలైనంత త్వరగా తెప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే హైపవర్ కమిటీ రెండు సార్లు భేటీ అయింది. మరో రెండు రోజుల్లో మూడోసారి భేటీ కాబోతోంది. ఈ క్రమంలో ఈ నెల 18వ తేదీన కెబినెట్ భేటీ నిర్వహించనుంది ప్రభుత్వం. ఈ కేబినెట్టులో హైపవర్ కమిటీ నివేదికకు ఆమోదం తెలపనుంది ప్రభుత్వం. ఆ తర్వాత 20వ తేదీన అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే అసెంబ్లీ సమావేశాలను ఒక్క రోజునే జరపాలా..? లేక మూడు రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలా..? అనే ఆలోచన చేస్తోంది ప్రభుత్వం.

 

మరోవైపు నివేదిక ఇచ్చేలోగా వీలైనంత త్వరగా వివిధ అంశాలను సెటిల్ చేసే పనిలో పడింది ప్రభుత్వం. ముఖ్యంగా రాజధాని రైతుల అంశాన్ని ఏ విధంగా సెటిల్ చేయాలనే అంశంపై ఫోకస్ పెట్టింది ప్రభుత్వం. ఈ క్రమంలో వివిధ వర్గాల రైతులను మంత్రులు కలుస్తున్నారు. మంత్రి బొత్సను  పలువురు రాజధాని రైతులు కలిశారు. అసైన్డ్ భూముల క్రయ విక్రయాలను రద్దు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను రద్దు చేయాలని కోరారు. అసలు అసైనీల నుంచి చాలా కాలం క్రితం తాము భూములు కొనుగోలు చేశామని అసైన్డ్ రైతులు బొత్స దృష్టికి తీసుకెళ్లారు. సెకండ్ పార్టీగా ఉన్న తమకు భూములు చెందేలా జీవోను సవరించాలని అసైన్డ్ రైతుల విన్నవించారు. మరో వైపు ల్యాండ్ పూలింగులో భూములు ఇవ్వడానికి నిరాకరించి కోర్టుకెక్కిన పలువురు రైతులూ బొత్సతో భేటీ అయ్యారు. అభివృద్ధికి అవసరమైన భూమి ఇస్తామని.. ప్రత్యామ్నాయంగా వేరే చోట భూమి ఇవ్వాలని బొత్సను కోరారు రైతులు. ఇక రాజధాని పరిధిలో భూమి లేని పేదలకు ఇస్తున్న ఫించన్ల మొత్తాన్ని మరింత పెంచాలని సూచించారు. మరో వైపు ఉద్యోగుల తరలింపు అంశంలోనూ క్లారిటీకి రానుంది ప్రభుత్వం.  అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో ఎలాంటి చర్చ జరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: