కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి మ‌రోమారు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మున్సిప‌ల్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో, తెలంగాణ సీఎం కేసీఆర్‌పై విరుచుకుప‌డ్డారు. ఆయ‌న‌తో పాటుగా త‌న‌యుడు, మంత్రి కేటీఆర్‌పై దుమ్మెత్తి పోశారు. టీఆర్ఎస్ పార్టీ ఏం చెప్పుకొని ఓట్లు అడుగుతుంద‌ని ప్ర‌శ్నించారు. మొదటి కృష్ణుడు సీఎం కేసీఆర్, రెండో కృష్ణుడు అని ఎద్దేవా చేశారు. మున్సిపల్ ఎన్నికలకి మొదటి కృష్ణుడికి మొహం చెల్లక, రెండో కృష్ణుడ్ని తెరమీదకు తెచ్చారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మొదటి కృష్ణుడు ఆ మాటలు చెబితే రెండో కృష్ణుడైన కేటీఆర్ తన సమర్ధవంతమైన పరిపాలన చూసి ఓట్లేయాలని అడుగుతున్నారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

 


గ‌తంలో కేసీఆర్ చెప్పిన మాట‌ల‌ను రేవంత్ రెడ్డి ఈ సంద‌ర్భంగా ప్ర‌స్తావించారు. ట్యాంక్‌బండ్‌లో ఉన్న నీళ్లను కొబ్బరి నీళ్ల లెక్క తాగేట్లు చేస్తామని, ట్యాంక్ బండ్ పక్కనే 100 అంతస్తుల సముదాయాన్ని నిర్మించి, అందులో పేదవాళ్లకు డబుల్ బెడ్ రూమ్ లు కేటాయిస్తామని, హైదరాబాద్ లో ట్రాఫిక్ శాస్వత పరిష్కార మార్గంగా ప్లైఓవర్లు నిర్మించి ప్రపంచంలోనే తెలంగాణను ప్రథమస్థానంలో నిలబెడతామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని చెప్పారని అయితే, ఇప్పుడు అవి అమ‌లు అయ్యాయా? అని రేవంత్ రెడ్డి ప్ర‌శ్నించారు. పట్టణ ప్రాంతాల్లో రెండు లక్షల డబుల్ బెడ్రూంలు, మిషన్ భగీరధ ద్వారా ఇంటింటికి నల్ల, 57ఏళ్లు నిండిన ప్రతీఒక్కరికి పెన్షన్ ఇస్తామన్న ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని ఎంతవరకు నెరవేర్చిందో చెప్పాలన్నారు.

 


కొత్త సీసాలో పాత సారా అన్న‌ట్లుగా కేసీఆర్‌, కేటీఆర్ తీరు ఉంద‌న్నారు. పాత సారాను కొత్తసీసాలో పోసి ప్రజల్ని మభ్యపెట్టి జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో నయానోభయానో భయపెట్టో, బెదిరించో గెలిచామని ప్రజలకు చెప్పేందుకు కేసీఆర్, కేటీఆర్ లు ఒకరు తెరముందు, ఇంకొకరు తెర వెనుక నాటకమాడుతున్నారని విమర్శించారు. మొదటి కృష్ణుడైన, రెండో కృష్ణుడైన సీసా మాత్రమే కొత్తది…అందులో సారా మాత్రం పాతదేనన్నారు. కేటీఆర్ సమర్ధత ఎలాంటిదో సిరిసిల్ల మున్సిపల్ చైర్ పర్సన్ పావనినీ అడిగితే తెలుస్తుందన్నారు. మున్సుపాలిటీలో పనులకు 3శాతం కమీషన్ తీసుకోమన్నారని కేటీఆర్ తమకు చెప్పినట్లు మున్సిపల్ చైర్ పర్సన్ చెప్పారాంటే రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పనితీరు ఎలా ఉందో చూడాలని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: