ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో పొత్తుల విషయాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కే వదిలేసారు ఆ పార్టీ నేతలు. కొందరు జనసేన పార్టీ నేతలు ఒంటరిగా పోటీ చేయాలని అభిప్రాయపడగా.. మరికొందరు మాత్రం టీడీపీ తో పొత్తు పెట్టుకోవాలని సూచించారు. తాజాగా జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన విస్తృతస్థాయి సమావేశంలో రాజధాని విషయంతోపాటు, స్థానిక సంస్థల ఎన్నికల పొత్తుపై చర్చ జరిగింది.



అధికార పార్టీ, ఇంకా బిజెపి తప్ప ఏ ఇతర పార్టీతో పొత్తు పెట్టుకున్న ప్రయోజనం ఉంటుందని ఆ పార్టీ నేతలు సూచించినట్లు సమాచారం. కొందరు మాత్రం టిడిపితో పొత్తు పెట్టుకుంటే ప్రయోజనం ఉంటుందని పవన్ కళ్యాణ్ ముందు ప్రతిపాదన చేశారు. అయితే ఒక వారంలో పవన్ కళ్యాణ్ నుండి ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.


జనసేన పార్టీ కార్యాలయంలో మూడు గంటల పాటు జరిగిన సమావేశంలో ముఖ్య నేతలు పాల్గొనగా.. వారు ప్రధానంగా రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో పార్టీ వ్యూహాలను చర్చించుకున్నారు. గతంలో సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి, బిజెపి, జనసేన పార్టీలు విడివిడిగా పోటీ చేయడం వల్ల తమ పార్టీ కేవలం ఒకే ఒక్క సీటు గెలుచుకున్నదని.. అదే ఒకవేళ కలిసి పోటీ చేసినట్లయితే ఎక్కువ మెజారిటీ వచ్చి ఉండేదని ఆ పార్టీ నేతలు ప్రస్తావించారు.


అయితే, బిజెపి పార్టీకి స్థానికంగా ఎక్కువ బలం లేదని, అలాగే బిజెపి పార్టీ టిడిపి పార్టీతో కలవనని చెప్పింది కాబట్టి కేవలం టీడీపీ తో కలిసి వెళితే కొద్దిపాటి మెజారిటీ అయిన వస్తుందని పార్టీ నేతలు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో చెప్పారు. అలాగే, ఇప్పుడు అధికార పార్టీపై వ్యతిరేకత ను సద్వినియోగం చేసుకొని తమకి అనుకూలంగా మార్చుకోవాలని పార్టీ నేతలు ప్రస్తావించారు. మరి టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకుంటారో లేదో చుడాలిక. 

మరింత సమాచారం తెలుసుకోండి: