రాజధానిలో ఉద్రిక్తతలు కాస్తా.. పోలీసులు, టీడీపీ మధ్య వార్‌లా మారుతోంది విపక్ష ర్యాలీలను పోలీసులు అడ్డుకోవడంపై చంద్రబాబు మండిపడ్డారు. డీజీపీ గౌతం సవాంగ్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు చంద్రబాబుకు.. పోలీసు అధికారుల సంఘం ఘాటుగా లేఖ రాసింది.

 

మంగళగిరిలోని పార్టీ కార్యాలయం నుంచి నరసరావుపేట పర్యటనకు బయల్దేరిన టీడీపీ  అధినేత చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. పార్టీ కార్యాలయం నుంచి నరసరావుపేటకు ప్రారంభమైన బైక్‌ ర్యాలీని పోలీసులు అడ్డుకుని నిలిపివేశారు. బైక్‌ ర్యాలీకి అనుమతి లేదన్నారు. దీంతో కారు దిగిన చంద్రబాబు పోలీసులపై ఫైర్ అయ్యారు. మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు ర్యాలీ చేస్తుంటే ఎలా అనుమతిస్తున్నారని.. తన వెంట వస్తున్న కార్యకర్తలను అడ్డుకోవాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ చట్ట వ్యతిరేక చర్యలను విడిచిపెట్టాలన్నారు. 

 

రాజ్యాంగం కల్పించిన హక్కు మేరకు అమరావతి పరిరక్షణ సమితి నిరసన తెలుపుతుంటే కఠిన నిర్బంధ చర్యలతో అడ్డుకుంటున్నారని చంద్రబాబు మండిపడ్డారు. దుర్గమ్మకు మొక్కు తీర్చుకోవడానికి పొంగళ్లు తీసుకెళ్తున్న మహిళలపై దౌర్జన్యం చేయడం..హక్కులను కాలరాయడం కాదా? అని ప్రశ్నించారు. దీర్ఘకాలం 144 సెక్షన్‌ అమలు చేయడం చట్ట విరుద్ధమని సుప్రీంకోర్టు చెప్పినా.. అమరావతి పరిధిలో ఎందుకు అమలు చేస్తున్నారో చెప్పాలన్నారు. దీనికి డీజీపీయే  బాధ్యత వహించాలన్నారు.

 

మరోవైపు చంద్రబాబుకి పోలీస్ అధికారుల సంఘం ఘాటుగా లేఖ రాసింది. డీజీపీ గౌతం సవాంగ్‌పై తరచు విమర్శలు చేయడాన్ని పోలీస్ అధికారుల సంఘం తప్పుబట్టింది. మీ ప్రభుత్వంలో పనిచేస్తే మెచ్చుకుని, మీరు ప్రతిపక్షంలో ఉంటే  విమర్శించడం సబబు కాదని వ్యాఖ్యానించింది. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పోలీసులపై బాధ్యతా రహితంగా  ఆరోపణలు చేయడం తగదని హితవు పలికింది. ప్రాంతీయ విబేధాలు సృష్టిస్తున్న మిమ్మల్ని దేశద్రోహి అని ఎందుకు అనకూడదని చంద్రబాబును ప్రశ్నించింది పోలీస్ అధికారుల సంఘం. పోలీస్ శాఖలో కులాల వారీగా విభజన తీసుకొచ్చే ప్రయత్నం చేసిన మీరు సంఘ ద్రోహి కాదా అని నిలదీసింది. కుల, మత, ప్రాంతాల పేరుతో చిచ్చు రగిలిస్తూ రాజకీయం చేస్తున్న మీకు డీజీపీపై విమర్శలు చేసే అర్హత లేదని వ్యాఖ్యానించింది. డీజీపీతో పాటు పోలీస్ శాఖకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేసింది పోలీస్ అధికారుల సంఘం. రాజకీయ పార్టీలు , రాజ్యాంగ పరిధిలో పోరాటం చేయడం తప్పుకాదని, కానీ వ్యవస్థలపై ఆరోపణలు చేయడం సరికాదని పోలీసులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: