పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా తయారైంది కేంద్ర అధికార పార్టీ బీజేపీ పరిస్థితి. జాతీయ పార్టీ అని గొప్పలు చెప్పుకుంటున్నా క్షేత్రస్థాయిలో మాత్రం ఆ పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ముఖ్యంగా తెలంగాణలో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నట్టుగా కనిపిస్తున్న బీజేపీ బలమైన నాయకులను ఆ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం ఆ పార్టీ బలహీనంగా ఉందనే సంకేతాలు వెలువడుతున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో అధికారం దక్కించుకోవాలని చూస్తున్న బిజెపి ఇప్పటి నుంచే దానికి తగ్గట్ట్టుగా కసరత్తు చేస్తోంది.


 ప్రస్తుతం తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో తమ ప్రతాపం చుపిస్తామంటూ హడావుడి చేస్తూనే వచ్చింది బిజెపి. మొత్తం  ఎన్నికల్లో 2727 నామినేషన్ లు దాఖలవ్వగా, దాదాపు 30శాతం అభ్యర్థులు నామినేషన్ వేయకపోవడం ఇప్పుడు పార్టీలో చర్చగా మారింది. ఈ రోజు రాష్ట్ర పార్టీ కార్యాలయానికి వచ్చిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి ఈ వ్యవహారంపై పార్టీ శ్రేణులపై అసహనం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో ముందు నుంచి ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తున్నా, ఇప్పటికీ  పార్టీ తరఫున అభ్యర్థులను నిలపలేని పరిస్థితుల్లో ఉంటే ఎలా ?  వచ్చే ఎన్నికల నాటికి అధికారం ఏ విధంగా దక్కించుకుంతాము అంటూ ఆయన అందుబాటులో ఉన్న నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. 


ముఖ్యంగా హైదరాబాద్ శివారులోని ఇబ్రహీంపట్నం, మహేశ్వరం ప్రాంతాల్లో బీజేపీ తరపున అనేక వార్డుల్లో నామినేషన్ దాఖలు కాకపోవడంతో ఆయన క్లస్టర్ ఇంచార్జీలను పిలిచి ప్రశ్నించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో టిఆర్ఎస్ కు దీటుగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నా ఆదిలోనే బీజేపీ ఇలా చతికిల పడడం మింగుడు పడడం లేదు. ఈ విషయం కేంద్ర పెద్దల వరకు వెళ్లడంతో, దీనిపై రాష్ట్ర నాయకులను వివరణ కోరినట్లు తెలుస్తోంది. ఏమైనా ఇది జాతీయ పార్టీ బీజేపీకి పెద్ద అవమానమే. 

మరింత సమాచారం తెలుసుకోండి: