నన్ను ఎవరూ ఏమీ చేయలేరమ్మా థర్టీ ఇయర్స్ ఇండ్రస్ట్రీ ఇక్కడ అంటూ సినిమాల్లో కామెడీ పండించే నటుడు, వైసీపీ కి చెందిన పృథ్వి రాజ్ రాజకీయ జీవితం ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చిన ఏడు నెలల కాలంలోనే ముగిసిపోయింది. మొదటి నుంచి వైసీపీ కి అండగా ఉంటూ ఆ పార్టీ తరపున ప్రత్యర్థులపై విమర్శలు చేసే పృద్వీ ఇప్పుడు అదే పార్టీ ఆగ్రహానికి గురయ్యి తన పదవిని కోల్పోయాడు. పార్టీ అధికారంలోకి వచ్చిన అతి స్వల్పకాలంలోనే పృద్వి వివాదాల్లో చిక్కుకుని జగన్ ఆగ్రహానికి గురయ్యాడు. రైతులపై అనుచిత వ్యాఖ్యలు, ఆడియో టేపుల వ్యవహారం ఆయనపై వేటుకు కారణమయ్యాయి.


ఈ నేపథ్యంలో పృథ్వీని రాజీనామా చేయాలంటూ టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. తనపై వచ్చిన ఆరోపణలు, టీటీడీ ఆదేశాల నేపథ్యంలో పృథ్వీ ఎస్వీబీసీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే, ఇప్పటికే రాజీనామా చేసినట్లు మరికొన్ని వర్గాల ద్వారా తెలుస్తోంది. అమరావతి రాజధాని కోసం ఆందోళన చేస్తున్న రైతులను పృథ్వీరాజ్ ఇంతకుముందు పెయిడ్ ఆర్టిస్టులంటూ కామెంట్స్ చేశారు. అదీ కాకుండా తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని నటుడు పోసాని కృష్ణ మురళికి సవాల్ విసిరి ఒక వేదిక మీద తనతో డిబేట్ కి రావాలంటూ సవాల్ చేశారు. దీనిపై వైసీపీ అధిష్ఠానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 


ఇదే సమయంలో పృథ్వీ రాజ్ఎస్వీబీసీ మహిళా ఉద్యోగితో అసభ్యంగా మాట్లాడినట్లు ఆడియో టేపులు బయటపడ్డాయి. అంతేగాక పలురువు మహిళా ఉద్యోగినులతో ఆయన అసభ్యంగా ప్రర్తించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయన స్పందించారు.తాను మహిళలపై అసభ్యంగా ప్రవర్తించినట్లు, మాట్లాడినట్లు వచ్చిన వార్తల్లో ఎంతమంత్రం నిజం లేదని పృథ్వీరాజ్ తెలిపారు. ఆడియో టేపులో ఉన్నది తన వాయిస్ కాదని, తనపై కుట్రజరుగుతోంది అంటూ ఆవేదన వ్యక్తం చేసారు. అయితే పృద్వి విషయంలో జగన్ బాగా సీరియస్ అయిన కారణంగా పృథ్వీపై టీటీడీ విజిలెన్స్ కమిటీ ఎస్వీబీసీలో విచారణ జరిపింది. మహిళలతో అసభ్యంగా మాట్లాడిన ఆడియో టేపులపై విచారణ జరిపి ఆ నివేదికను టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి అందించారు. ఈ క్రమంలోనే పృథ్వి రాజీనామా చేసినట్టు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: