కరీంనగర్, నిజామాబాద్ కార్పోరేషన్లలో  బిజెపి, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కయి, లోపాయికారీ ఒప్పందాన్ని చేసుకునున్నాయని టీఆరెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు . టీఆరెస్ ను ఎదుర్కోలేననే ఆ  రెండు పార్టీలు   కలిసి పనిచేస్తున్నాయని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారం లో  ఆ  రెండు పార్టీల అనైతిక పొత్తును  ప్రజల ముందు ఎండగట్టాలని  పార్టీ క్యాడర్ కు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు .  నిజామాబాద్ , కరీంనగర్ కార్పొరేషన్లను ఎట్టి పరిస్థితుల్లో కైవసం చేసుకోవాలని టీఆరెస్ నాయకత్వం తీవ్ర కసరత్తే చేస్తోంది .

 

లోక్ సభ ఎన్నికల్లో కరీంనగర్ , నిజామాబాద్ స్థానాల్లో తమ పార్టీ అభర్ధుల అనూహ్య ఓటమి తరువాత ,   మున్సిపల్  ఎన్నికల్లో ఈ రెండు కార్పొరేషన్లను కైవసం చేసుకుని తమ సత్తా చాటాలని టీఆరెస్ నాయకత్వం భావిస్తోంది . ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో పార్టీ ఆవిర్భావం నుంచి టీఆరెస్ కు  కంచుకోట మాదిరిగా ఉన్న కరీంనగర్ లో  ఆ పార్టీ అభ్యర్థి , సీనియర్ నాయకుడు బోయినపల్లి వినోద్ కుమార్ అనూహ్య ఓటమి పార్టీ నాయకత్వాన్ని షాక్ కు గురి చేసింది . ఎలాగైనా గెలుస్తామన్న అతి విశ్వాసం వల్లే తాను ఓటమి పాలయినట్లు ఇటీవల వినోద్ కుమార్ వెల్లడించారు .

 

మున్సిపోల్స్ లో అతి విశ్వాసానికి పోరాదని ఆయన పార్టీ నేతలకు సూచించారు . ఇక నిజామాబాద్ లోక్ సభ స్థానం లోను కవిత ఓటమి , పార్టీ క్యాడర్ ను మానసికంగా దెబ్బతీసింది . ఈ నేపధ్యం లో ఈ రెండు కార్పొరేషన్లలో విజయబావుటా ఎగురవేయాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది .   అయితే మున్సిపోల్స్ లో ఒంటరిగా అధికార పార్టీని ఎదుర్కోవడం కష్టమని భావిస్తోన్న కాంగ్రెస్ , బీజేపీ లు లోపాయకారిగా ఒప్పందం చేసుకుని టీఆరెస్ అభ్యర్థులను ఓడించాలని పథకరచన చేస్తున్నట్లు తెలుస్తోంది . 

మరింత సమాచారం తెలుసుకోండి: