అమెరికాలో ఒక్క‌రోజే రెండు ప్ర‌త్యేక‌త‌లు న‌మోద‌య్యాయి. ఒక‌టి హైద‌రాబాద్ వాసి వ‌ల్ల న‌మోదైన ప్ర‌త్యేక రికార్డు కాగా మ‌రొక‌టి మ‌న భార‌తీయులు సంతోషించ‌ద‌గ్గ విష‌యం. ముందుగా హైదరాబాద్ ప్ర‌త్యేక‌త‌లు చూస్తే... భాగ్య‌న‌గ‌రం మూలాలున్న భారత సంతతి వ్యక్తి రాజా జాన్‌ వర్పుతూర్‌ చారి అరుదైన ఘనత సాధించారు. నాసాలో వ్యోమగామిగా ఎంపికయ్యారు. విజయవంతంగా రెండేళ్ల‌ శిక్షణ పూర్తి చేసుకున్నారు. భవిష్యత్తులో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం, చందమామ, అంగారకుడిపైకి నాసా చేపట్టనున్న మానవ సహిత అంతరిక్ష యాత్ర ల్లో రాజా చారి భాగస్వామి కానున్నారు. ఇక మ‌రో అంశం,  అమెరికాలో స్థిరపడిన భారత సంతతికి చెందిన మహిళా వ్యాపారవేత్త అపర్ణ మాదిరెడ్డి నవంబర్‌లో జరుగనున్న శాన్మ్రోన్‌ నగర మేయర్‌ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు.

 


రాజా చారి విష‌యానికి వ‌స్తే, తండ్రి శ్రీనివాసాచారి స్వస్థలం హైదరాబాద్‌. ఆయన కొన్ని దశాబ్దాల కిందటే ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికాకు వెళ్లి స్థిరపడ్డారు. రాజాచారి అమెరికాలోనే పుట్టి పెరిగారు. ప్రస్తుతం ఆయన వయసు 41 ఏళ్లు. రాజా చారి అమెరికాలోని అయోవా రాష్ట్రం వాటర్‌లూ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. అమెరికా వైమానిక దళంలో కర్నల్‌గా పనిచేస్తున్నారు. ఆయన యూఎస్‌ ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలో ‘ఆస్ట్రోనాటికల్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ సైన్స్‌'లో డిగ్రీ పూర్తిచేశారు. మసాచూసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ నుంచి ఏరోనాటిక్స్‌లో పీజీ చేశారు. ఆ తర్వాత కాలిఫోర్నియా ఎయిర్‌బేస్‌లోని 461-ఫ్లైట్‌ టెస్ట్‌ స్కాడ్రన్‌లో కమాండర్‌గా చేరారు. రాజా చారి తండ్రి శ్రీనివాస్‌ చారి స్వస్థలం హైదరాబాద్‌. ఆయన ఇంజినీరింగ్‌ చదివేందుకు అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. రాజా చారి భార్య పేరు హోలీ. వారికి ముగ్గురు సంతానం. తన తండ్రి ఇచ్చిన స్ఫూర్తితోనే శ్రమించానని, ఉన్నత చదువులు చదివానని రాజా చారి చెప్తుంటారు.

 


ఇక అప‌ర్ణ విష‌యానికి వ‌స్తే, కాలిఫోర్నియా రాష్ర్టంలోని శాన్మ్రోన్‌ నగరం నుంచి మేయర్‌ అభ్యర్థిగా ఆమె బరిలో నిలువనున్నారు. అమెరికాలో ‘అర్వాసాఫ్ట్‌' పేరిట సాఫ్ట్‌వేర్‌ కన్సల్టింగ్‌ సంస్థను నిర్వహిస్తున్న అపర్ణకు భర్త, ఒక కూతురు ఉన్నారు. ప్రస్తుతం కాంట్రా కోస్టా రాష్ర్ట జనగణన 2020 కమిటీకి ప్రతినిధిగా, సిటీ ఓపెన్‌ స్పేస్‌ అడ్వైజరీ కమిటీకి చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్న అపర్ణ.. భౌగోళిక శాస్త్రంలో మాస్టర్స్‌ చేశారు. గతంలో సిటీ కౌన్సిల్‌ సభ్యురాలుగా కూడా ఆమె పనిచేశారు. తనకున్న నాయకత్వ అనుభవంతో శాన్మ్రోన్‌ నగరాన్ని అభివృద్ధి చేస్తానని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం శాన్మ్రోన్‌కు బిల్‌ క్లార్క్‌సన్‌ మేయర్‌గా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: