పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) విష‌యంలో అధికార‌-ప్ర‌తిప‌క్షాల మ‌ధ్య మాట‌ల యుద్ధం జ‌రుగుతోంది. తాజాగా, ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ మ‌ధ్య  ఈ అంశంపై ప‌ర‌స్ప‌ర కామెంట్లు జ‌రిగాయి. సీఏఏ, జాతీయ పౌర పట్టిక(ఎన్నార్సీ), ఎన్పీఆర్, విద్యార్థుల నిరసన; జమ్ముకశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులు; దేశ ఆర్థిక వ్యవస్థ; అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలపై చర్చించేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) స‌మావేశ‌మైంది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ అధ్యక్షతన ఢిల్లీలో జ‌రిగిన‌ సీడబ్ల్యూసీ సమావేశంలో సీఎఏ వెనక్కి తీసుకోవాలని, జాతీయ జనాభా పట్టిక(ఎన్పీఆర్)ను వెంటనే నిలిపివేయాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) డిమాండ్ చేసింది. తనకొచ్చిన మెజారిటీతో బీజేపీ విభజన, వివక్షాపూరిత ఎజెండాను తెరపైకి తెచ్చిందని ఆరోపించింది.


సీడబ్ల్యూసీ సమావేశంలో సోనియాగాంధీ మాట్లాడుతూ.. సీఏఏను ఒక వివక్షాపూరితమైన, విభజన చట్టంగా అభివర్ణించారు. ప్రజల్ని మతప్రాతిపదికన విభజించడమే ఆ చట్టం ఉద్దేశమని ఆరోపించారు. ఎన్నార్సీకి మారు వేషమే ఎన్పీఆర్ అని అన్నారు. సీఏఏ అమలుతో తీవ్రమైన నష్టం జరుగుతుందని గ్రహించిన వేలాది మంది యువకులు, యువతులు, ముఖ్యంగా విద్యార్థులు చలి, పోలీసుల హింసను కూడా లెక్కచేయకుండా వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపుతున్నట్టు సోనియా పేర్కొన్నారు. సీఏఏను వ్యతిరేకిస్తూ చేపట్టిన నిరసనల్లో జరిగిన సంఘటనలు, బాధితులకు సత్వర న్యాయం తదితర అంశాలను విచారించేందుకు సమగ్ర ఉన్నత స్థాయి కమిషన్‌ను ఏర్పాటు చేయాలి అని ఆమె డిమాండ్ చేశారు. సీఏఏపై ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. 

 


అయితే, దీనిపై ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ క్లారిటీ ఇచ్చారు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) ప్రజల పౌరసత్వాన్ని తీసివేయడానికి కాదు.. పౌరసత్వాన్ని ఇవ్వడానికి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సీఏఏ పై ప్రతిపక్షాలు దుష్ప్రాచారం చేస్తున్నాయని ప్రధాని దుయ్యబట్టారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని పశ్చిమ బెంగాల్‌ పర్యటనకు విచ్చేసిన విషయం తెలిసిందే. రెండు రోజు కోల్‌కతా పర్యటనలో భాగంగా ప్రధాని ఈ ఉదయం బేలూరు మఠాన్ని సందర్శించారు. గడిచిన రాత్రి ప్రధాని రామకృష్ణ మిషన్‌ ప్రధాన కార్యాలయంలోనే బస చేశారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా మోదీ ఘన నివాళి అర్పించారు. అనంతరం బేలూరు మఠంలో విద్యార్థులను ఉద్దేశిస్తూ ప్రధాని ప్రసంగించారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా విద్యార్థులందరికీ ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. సీఏఏ గురించి మీరేం అర్థం చేసుకున్నారు. ప్రతిపక్షాలు కనీసం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం లేదన్నారు. సీఏఏ అమలుపై ఎంతో స్పష్టత ఇచ్చినప్పటికీ కొంతమంది తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారన్నారు. పాకిస్థాన్‌లోని మైనారిటీలు ఎన్నో వేధింపులు ఎదుర్కొంటున్నారు. ఆ విషయం ప్రపంచానికి అర్థమౌతుంది. గడిచిన 70 ఏళ్లుగా మైనార్టీలపై పాకిస్థాన్‌ ఎందుకు దారుణాలకు పాల్పడిందో సమాధానం చెప్పాలన్నారు. ఈశాన్య రాష్ర్టాల సాంప్రదాయం, జనాభా, వంటకాలు మనకెంతో గర్వకారణమన్నారు. సీఏఏ చట్టంతో ఈశాన్య రాష్ర్టాల ప్రజల ప్రయోజనాలకు ఎటువంటి ఇబ్బందులు కలగని ప్రధాని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: