హైద‌రాబాద్ ప్ర‌జ‌ల‌కు గుడ్ న్యూస్‌. మెట్రోరైలు మొదటిదశ ప్రాజెక్టు పూర్తిదశకు వచ్చింది.  ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకుని ట్రయల్ రన్ నిర్వహించుకుంటున్న..కారిడార్-3 జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో రైలు కారిడార్ కు తుది అనుమతులు లభించాయి. ఇప్ప‌టికే, నాగోల్‌ నుంచి హైటెక్‌సిటీ, ఎల్బీనగర్‌ నుంచి మియాపూర్‌ వరకు మెట్రోరైలు రాకపోకలు సాగిస్తూ ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతున్న త‌రుణంలో...ఈ కారిడార్ అందుబాటులోకి వ‌స్తే...మ‌రింత వెసులుబాటు ద‌క్క‌నుంది.

 


పాత నగరాన్ని కొత్త నగరంతో అనుసంధానం చేసే మణిహారంగా జేబీఎస్‌–ఫలక్‌నుమా కారిడార్‌ నిలిచిపోనుంది. జేబీఎస్‌–పరేడ్‌గ్రౌండ్స్, సికింద్రాబాద్‌ వెస్ట్, గాంధీ హాస్పిటల్, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, చిక్కడపల్లి, నారాయణగూడ, సుల్తాన్‌బజార్, ఎంజీబీఎస్‌ వరకు 16 నిమిషాల సమయం పట్టనున్నట్లు అధికారులు అంచనా వేశారు. సాధారణంగా అయితే ఈ రూట్‌లో రోడ్డు మార్గంలో  45 నిమిషాల వరకు సమయం పడుతుందని ఎన్‌వీఎస్‌ రెడ్డి తెలిపారు. మరికొన్ని వారాల పాటు ట్రయల్‌ రన్‌ నిర్వహించి.. ఆ తర్వాత ప్రయాణికుల రాకపోకలకు అనుమతినిస్తారు. ట్రయల్‌ రన్‌లో భాగంగా సాంకేతిక సమర్థత, రైళ్ల నిర్వహణ, సమయపాలన, సిగ్నలింగ్‌ వ్యవస్థ పనితీరు, బ్రేక్‌ టెస్ట్, ట్రైన్‌ కంట్రోల్‌ సిస్టమ్, ప్యాసింజర్‌ ఇన్ఫర్మేషన్, రైళ్ల రాకపోకల అనౌన్స్‌మెంట్‌ తదితర అంశాలను పరిశీలించారు. జేబీఎస్-ఎంజీబీఎస్ మార్గంలో 18 రకాల భద్రతా తనిఖీలు నిర్వహించిన అధికారులు.. తుది అనుమతులు మంజూరు చేశారు. విద్యుత్, అగ్నిమాపక, భద్రత, లిఫ్టులు, ఎస్కలేటర్లు, ట్రాక్స్ కు అధికారులు ఆదివారం తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. తనిఖీల అనంతరం మెట్రో రైల్ భద్రత కమిషనర్ జే.కే.కే. గార్గ్ క్లియరెన్స్ ఇచ్చారు.

 


కరీంనగర్, సిద్దిపేట, మెదక్, గజ్వేల్‌ తదితర ప్రాంతాల నుంచి జేబీఎస్‌కు వచ్చే ప్రయాణికులు మెట్రో మార్గంలో  నేరుగా ఎంజీబీఎస్‌కు చేరుకోవచ్చు. ప్రస్తుతం ఈ మార్గంలో ప్రతిరోజు వేలాది మంది రాకపోకలు సాగిస్తున్నారు. అలాగే రైల్వేస్టేషన్‌ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే  ప్రయాణికులకు కూడా మెట్రో ఎంతో సౌకర్యంగా ఉండనుంది. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, చిక్కడపల్లి, నారాయణగూడ నుంచి సుల్తాన్‌బజార్‌ వరకు  వాహనాల రాకపోకలతో ప్రతినిత్యం ఎంతో రద్దీగా ఉంటుంది. మెట్రో రాక వల్ల ప్రయాణికులకు ఈ మార్గంలో ఊరట లభించనుంది.  

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: