మన పర్యావరణానికి తీవ్ర న‌ష్టాన్ని క‌లిగిస్తున్న‌ వాటిలో ప్లాస్టిక్ అత్యంత ప్రమాదకరం. ఒక ప్లాస్టిక్ వస్తువు మట్టిలో పూర్తిగా కలవాలంటే కొన్ని వేల సంవత్సరాలు పడుతుంద‌న్న విష‌యం తెలిసిందే.  నానాటికి పెరిగి పోతున్న ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేందుకు ప్ర‌భుత్వం ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌జ‌ల‌కు నిబంధ‌న‌లు పెడుతూనే ఉంది. కాని దాన్ని ఎవ్వ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు.  ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సుమారు 100 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తి ఆవుతుంద‌ని స‌మాచారం.  దీని కోసం రోజు ఏడు మిలియన్ బ్యారేల్స్ పెట్రోలియం ఖర్చవుతుంది. ఇతర రకాలుగా ఉపయోగపడే పెట్రోలియం ఉపయోగించి ప్లాస్టిక్ తయారు చేసే ఖర్చుతో పాటు, పర్యావరణానికి హాని కలుగుతుంది.

 

 క్యారిబ్యాగులతో సహా ఎన్నో గృహావసరాలకు వాడి పడేస్తున్న ప్లాస్టిక్ భూమిలో కరిగిపోవడానికి ఎన్నో సంవత్సరాలు పడుతుంది. ఇక ఈ ప్లాస్టిక్‌ని క‌నీసం గ్రామాల్లో అయినా స‌రే అరిక‌ట్టాల‌న్న మంచి ఉద్దేశంతో క‌రీంన‌గ‌ర్ కి చెందిన  ల‌స్మ‌న్న‌ప‌ల్లి గ్రామ స‌ర్పంచ్ కాయిత రాములు ఒక గొప్ప కార‌క్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టారు. అదేమిటంటే... ప‌ల్లె ప్ర‌గ‌తి రెండో విడుత ముగింపు సంద‌ర్భంగా ఆయ‌న ఆదివారంనాడు గ్రామ స‌భ‌లో మీడియా స‌మ‌క్షంలో ఆయ‌న మాట్లాడుతూ... కిలో ప్లాస్టిక్ ని తీసుకువ‌చ్చి ఇచ్చిన వారికి కిలో చికెన్ ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు. 

 

దీంతో ఆ గ్రామ ప్ర‌జ‌లంతా ముందుకు వ‌చ్చి వారి వారి ఇళ్ళ‌ల్లో ఉన్న ప్లాస్టిక్ లాంటి వ్య‌ర్ధాల‌ను తీసుకువ‌చ్చి చికెన్ ను తీసుకువెళ్ళారు. ఇక ఆదివారం నాడు కేవ‌లం ఆ ఒక్క గ్రామం నుండే ప‌ది కిలోల దాకా ప్లాస్టిక్ వ్య‌ర్ధాల‌ను స‌ర్పంచ్ రాములు సేక‌రించిన‌ట్లు ఆయ‌న తెలిపారు. ఇంకా ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన వాళ్ళ‌లో ఎంపీపీ సార‌బుడ్ల ప్ర‌భాక‌ర్‌రెడ్డి, మండ‌ల ప్ర‌త్యేకాధికారి ర‌వీంద‌ర్‌, ఎంపీడీఓ ప‌ద్మావ‌తి, సింగిల్ విండో చైర్మ‌న్ సార‌బుడ్ల రాజిరెడ్డి వీరంద‌రూ క‌లిసి ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొని గ్రామ‌స్తుల‌కు చికెన్ ను ఇచ్చారు. అంతేకాక ఈ సంద‌ర్భంగా వారు స‌ర్పంచ్‌ను కూడా అభినందించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: