ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు మరోసారి భేటీ అవుతారని వార్తలు వచ్చాయి. ఈమేరకు సమావేశం ఖరారైంది. వీరిద్దరూ గతంలోనూ భేటీ అయ్యారు. ఇందులో పెద్ద విశేషం ఏమీ లేదు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే.. గతంలో వీరు భేటీ అయినా ఇరు రాష్ట్రాల అధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలపై చర్చించారు. వాటికి పరిష్కార మార్గాలు వెదికే ప్రయత్నం చేశారు.

 

అలాగే గోదావరి జలాలను రెండు రాష్ట్రాలు కలిసి ఎలా సద్వినియోగం చేసుకోవాలన్న ఆలోచన చేశారు. అయితే ఈనాటి సమావేశంలో ఆ సీన్ ఉండబోదని తెలుస్తోంది. ఏపీ సీఎం జగన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం భేటీ అవుతున్న వార్తలకు సంబంధించిన ఈ అప్ డేట్ ఆసక్తికరంగా ఉంది. ఈసారి వీరిద్దరూ కేసీఆర్ నివాసం ప్రగతి భవన్ లో అధికారులు ఎవరూ లేకుండానే చర్చలు జరుపుతారని తెలుస్తోంది. ఒక వేళ అధికారులు ఉన్నా.. ఆ తర్వాత వారిద్దరూ ఏకాంత సమావేశం జరిపే అవకాశం ఉంది.

 

కానీ ఈసారి భేటీలకు అధికారులు హాజరుకావడం లేదని తెలుస్తోంది. వారిద్దరే చర్చలు జరుపుతారని వార్తలు వస్తున్నాయి. కొందరు ముఖ్య అధికారులను ఈ సమావేశం గురించి సంప్రదిస్తే.. వారు కూడా తమకేమీ సమాచారం లేదని చెబుతుంటం విశేషం. తాము కూడా మీడియాలోనే చూశామని, తమకు ఎలాంటి సమాచారం లేదని కీలకమైన అధికారులు కూడా చెబుతున్నారు. అలాంటప్పుడు జగన్, కేసీఆర్ ల భేటీ మర్యాదపూర్వక భేటీనా అన్న అనుమానం కలుగుతోంది.

 

లేని పక్షంలో కీలకమైన పెండింగులో ఉన్న విభజన అంశాలపై చర్చించి.. వీరిద్దరూ ఒక అవగాహనకు వస్తారా అన్న చర్చ కూడా జరుగుతోంది. రెండు రాష్ట్రాల మధ్య షెడ్యూల్ 9, 10లలోని ఆస్తుల విభజనకు సంబంధించిన అనేక అంశాలపై ఇంకా చిక్కుముడులు వీడలేదు. ఓవైపు కేంద్రం మాత్రం ఈ సమస్యలను రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పరిష్కరించుకుంటే మంచిదని సలహా ఇస్తోంది. ఈ నేపథ్యంలో వీరి భేటీ ఎలా జరగబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: