ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ఎన్నికల కమిషన్ శరవేగంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో స్థానిక ఎన్నికలకు బ్రేక్ వేసే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ దిశలోనే ప్రభుత్వంలోని ముఖ్య నేతల నుండి సంకేతాలు అందుతున్నాయి. కొత్త జిల్లాల ప్రకటనను తెరమీదకు తీసుకొనిరావటం ద్వారా ఎన్నికల నిర్వహణను వాయిదా వేయాలని ప్రభుత్వం భావిస్తోందని స్థానిక ఎన్నికలు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. 
 
ఏపీ మంత్రి ఒకరు ఇందుకు సంబంధించిన సన్నాహాలు కూడా వేగంగా జరుగుతున్నట్టు విలేకరులకు చెప్పారు. ఈ నెల 26వ తేదీన సీఎం జగన్ కొత్త జిల్లాల ప్రకటనకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 18వ తేదీన జరగనున్న కేబినేట్ సమావేశంలో చర్చ జరిపి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే 17వ తేదీ తరువాత ప్రాదేశిక ఎన్నికల నిర్వహణ చేపడతామని ప్రకటన చేసిన విషయం తెలిసిందే. 
 
అదే జరిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుంది. ఎన్నికల కోడ్ రాష్ట్రంలో అమలులోకి వస్తే ఎన్నికల కమిషన్ అనుమతి ఉంటే మాత్రమే కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉంటుంది. ఎన్నికల కమిషన్ కు ప్రభుత్వం కొత్త జిల్లాల ప్రకటన గురించి తెలియజేసి కొత్త జిల్లాల గురించి ప్రకటన చేయనుందని తెలుస్తోంది. ప్రభుత్వం షెడ్యూల్ విడుదల కొన్ని రోజుల పాటు వాయిదా వేయాలని కూడా కోరే అవకాశం ఉంది. 
 
కానీ ప్రభుత్వం అలాంటి విజ్ఞప్తి చేసే అవకాశం చాలా తక్కువగా ఉందని తెలుస్తోంది. షెడ్యూల్ విడుదలైన తరువాత కొత్త జిల్లాల ప్రకటన చేస్తే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అందువలన పాత షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరిపి జిల్లా పరిషత్ లను విభజించడానికి కూడా అవకాశం ఉందని తెలుస్తోంది. ఏపీ ఎన్నికల కమిషన్ ఏ నిర్ణయం వైపు మొగ్గు చూపుతుందో తెలియాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: