తెలుగుదేశం పార్టీ.. గతమెంతో ఘన కీర్తి కలిగిన పార్టీ.. దాదాపు రెండు దశాబ్దాలకు పైగా తెలుగు నేలను ఏలిన పార్టీ.. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ప్రపంచంలో ఎక్కడ తెలుగు వారు ఉన్నా అక్కడ తెలుగుదేశం ఉంటుందని ఆ పార్టీ గతంలో గతంలో ఘనంగా చెప్పుకునేది. కానీ ఇప్పుడు ఆ పార్టీ ప్రతిష్ట మసకబారుతోంది. తెలుగు రాష్ట్రాలోని తెలంగాణలో ఆ పార్టీ దాదాపు క్లోజ్ అయ్యింది. కనీసం ఆ పార్టీకి అసెంబ్లీలోనూ ప్రాతినిధ్యం లభించలేదు. ఒకటీ అరా గెలిచినా వారు.. పార్టీ నుంచి జంప్ అయ్యే పరిస్థితి.

 

ఇక ఎంపీ సీట్ల విషయానికి వస్తే కనీసం పోటీ కూడా చేయలేదు. పోనీ ఏపీలోనైనా పరిస్థితి బావుందా అంటే అదీ లేదు.. 175 అసెంబ్లీ సీట్లకు కేవలం 23 మాత్రమే గెలుచుకుని దారుణమైన ఓటమి చవిచూసింది. అందుకే వైసీపీ నేతలు ఆ పార్టీపై ఘాటు విమర్శలు చేస్తున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు వైఖరితో తెలుగు దేశం ఏపీలో కూడా కనుమరుగు అవుతుందంటున్నారు వైసీపీ ఎమ్మెల్యే హాఫిజ్‌ఖాన్.

 

అమరావతి భూములను చంద్రబాబు, టీడీపీ నేతలు ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌ చేసి అవినీతికి పాల్పడ్డారని.. ఇది బయటకు వస్తుందనే చంద్రబాబు బస్సు యాత్ర చేస్తున్నారని హఫీజ్ ఖాన్ ఆరోపించారు. అమరావతి భూముల్లో చేసిన అవినీతి బయటకు రాకూడదనే.. చంద్రబాబు సరికొత్త నాటకానికి తెరలేపారన్నారు. ఇప్పటికే తెలంగాణలో టీడీపీ క్లోజ్‌ అయ్యిందని, ఇక ఏపీలో కూడా క్లోజ్‌ ఖావడం ఖాయమని ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, దీనిని అమలు చేస్తున్న ఏపీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డిపై టీడీపీ బురద జల్లుతుందన్నారు.

 

చంద్రబాబు రాయలసీమలో అడుగుపెట్టే హక్కును కోల్పోయారని ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అన్నారు. కర్నూలుకు రావాల్సిన రాజధానిని చంద్రబాబు అమరావతికి తరలించారు. 9 ఏళ్లు హైదరాబాద్‌లో అభివృద్ధి కేంద్రీకరణ చేసి తప్పు చేశారు. అదే తప్పును అమరావతిలోనూ చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణంతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. దీనికి అడ్డుపడితే ప్రజలే బుద్ధి చెబుతారు అని హఫీజ్‌ ఖాన్‌ విమర్శించారు. చంద్రబాబు రాయలసీమ ద్రోహి అని ఎమ్మెల్యే విమ‌ర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: